Bangladesh: చిన్నయి కృష్ణదాస్‌కు దక్కని ఊరట.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన బంగ్లాదేశ్ కోర్టు!
- చిన్నయి కృష్ణదాస్ బెయిల్ కోసం పదకొండు మంది లాయర్ల బృందం ప్రయత్నం
- బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన చటోగ్రాం కోర్టు
- కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వలేమన్న బంగ్లాదేశ్ కోర్టు
బంగ్లాదేశ్ జైల్లో ఉన్న ఇస్కాన్ గురువు చిన్మయి కృష్ణదాస్‌కు అక్కడి కోర్టులో బెయిల్ లభించలేదు. ఆయన దేశద్రోహం నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయన బెయిల్ కోసం పదకొండు మంది లాయర్ల బృందం ప్రయత్నించింది. కానీ అక్కడి చటోగ్రాం కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
బెయిల్ పిటిషన్‌పై అరగంట పాటు చటోగ్రాం కోర్టులో వాదనలు జరిగాయి. ఈరోజు విచారణ సందర్భంగా కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి చిన్మయి కృష్ణదాస్‌కు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది.
బంగ్లాదేశ్ జెండాను ఆవమానించారనే ఆరోపణలతో 2024 నవంబర్ 25న పోలీసులు చిన్మయి కృష్ణదాస్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనిని జైలుకు పంపించారు. అయితే చిన్మయి కృష్ణదాస్ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రయత్నించిన న్యాయవాదులపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన కేసును వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే చిన్మయి భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ పదకొండు మంది లాయర్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.