Rohit Sharma: చివరి టెస్ట్ నుంచి సొంతంగా తప్పుకోనున్న రోహిత్ శర్మ?.. తుది జట్టు ఇదేనా!

it is very possible that the captain Rohit Sharma drops himself for the final Test says Report

  • పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్ రోహిత్ తుది జట్టు నుంచి తప్పుకోవచ్చంటూ కథనాలు
  • గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులే సాధించిన హిట్‌మ్యాన్
  • చివరి టెస్టులో బుమ్రా చేతికి కెప్టెన్సీ పగ్గాలు!
  • రోహిత్ స్థానంలో గిల్, పంత్ స్థానంలో జురెల్‌ను జట్టులోకి తీసుకోవచ్చంటూ ఊహాగానాలు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరిదైన ఐదవ టెస్ట్ మ్యాచ్ రేపటి (శుక్రవారం) నుంచి సిడ్నీ వేదికగా ఆరంభం కానుంది. సిరీస్‌లో ఇప్పటికే 1-2 తేడాతో వెనుకబడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా పకడ్బందీగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా జట్టులో పలు కీలకమైన మార్పులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

వరుసగా విఫలమవుతున్న పలువురు ప్లేయర్లపై వేటు పడొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఈ జాబితాలో కెప్టెన్ రోహిత్ శర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మరోసారి కెప్టెన్ పగ్గాలు అప్పగించి రోహిత్ శర్మ తుది జట్టు నుంచి వైదొలగొచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు తనకు తానుగా హిట్‌మ్యాన్ తప్పుకోవచ్చని తెలుస్తోంది. రోహిత్ ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి మొత్తం కలిపి కేవలం 31 పరుగులే చేశాడు. మిడిల్ ఆర్డర్‌, టాపార్డర్ రెండు స్థానాల్లోనూ రాణించలేకపోయాడు. 

ఒకవేళ రోహిత్‌ వర్మ తప్పుకుంటే అతడి స్థానంలో శుభ్‌మాన్ గిల్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే కేఎల్ రాహుల్ ఓపెనర్‌‌గా బ్యాటింగ్‌కు దిగే అవకాశాలుంటాయి. మొదటి మూడు టెస్టులలో ఈ ఫార్మాలా బాగానే పనిచేసిన విషయం తెలిసిందే.

మరోవైపు, రిషబ్ పంత్ ను తొలగించి అతడి స్థానంలో యువ ప్లేయర్ ధృవ్ జురెల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. రిషబ్ పంత్ ఇప్పటివరకు కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోవడంతో అతడిపై వేటు ఖాయమంటూ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. 

విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఫామ్‌లో లేకపోయినప్పటికీ, వాషింగ్టన్ సుందర్‌ బౌలింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ జట్టులో వీరిద్దరి స్థానాలకు ఢోకా లేదు. ఇక పేసర్ ఆకాశ్ దీప్ దూరమవడంతో పేస్ బౌలింగ్‌లో మార్పులకు అవకాశం లేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్న మహ్మద్ సిరాజ్‌కు కూడా చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలావుంచితే, వెన్నునొప్పి కారణంగా పేసర్ ఆకాశ్ దీప్ ఐదో టెస్టుకు దూరమవుతున్నాడని కోచ్ గౌతమ్ గంభీర్ ధృవీకరించాడు. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్టులో భారత జట్టు కూర్పు ఆసక్తికరంగా ఉండవచ్చు.

సిడ్నీ టెస్టుకు అంచనా తుది జట్టు ఇదే
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, ధృవ్ జురెల్ (వికెట్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

  • Loading...

More Telugu News