Actor Fish Venkat: పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం.. ఫిష్ వెంకట్ భావోద్వేగం.. వైరల్ వీడియో!
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్
- సినిమాలకు దూరం కావడంతో ఆర్థికంగానూ ఇబ్బందులు
- సాయం కోసం భార్య సూచనతో పవన్‌ను కలిసిన వెంకట్
- రూ.2 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఆయన చికిత్సకు సహకరిస్తానని పవన్ హామీ
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు.
అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం కావడంతో వెంకట్ ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖ నటులు తెలుసు కనుక ఈ కష్టసమయంలో ఎవరినైనా సాయం కోరాలని కుటుంబ సభ్యులు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. దాంతో సాయం విషయమై తన భార్య సువర్ణ ఒత్తిడి మేరకు పవన్‌ను కలిసినట్లు వెంకట్ చెప్పారు.
పవన్‌ను కలిసి, తన అనారోగ్య సమస్యను వివరించడంతో వెంటనే అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అలాగే తన ఆర్థిక ఇబ్బందులను గమనించి తన బ్యాంకు ఖాతాలో వెంటనే రూ. 2 లక్షలు జమ చేయించారని వెంకట్ పేర్కొన్నారు.
తనను ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కల్యాణ్, ఆయన కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుడ్ని కోరుకుంటున్నానని ఫిష్ వెంకట్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను పవన్ అభిమానులు షేర్ చేయగా వైరల్ అవుతోంది.