Donald Trump: అమెరికాలో ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ముందు టెస్లా కారులో పేలుడు... ఎలాన్ మస్క్ స్పందన
- లాస్ వెగాస్ లోని ట్రంప్ హోటల్ ముందు పేలిపోయిన టెస్లా కారు
- పేలుడు వెనుక ఉగ్ర చర్య కనిపిస్తోందన్న ఎలాన్ మస్క్
- పేలుడు పదార్థం లేదా బాంబ్ కారణంగా పేలుడు సంభవించిందన్న మస్క్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ఎదురుగా పేలుడు చోటుచేసుకుంది. లాస్ వెగాస్ లో ఉన్న ఈ హోటల్ వెలుపల టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారు. పేలుడు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేలుడు ఘటనపై లాస్ వెగాస్ పోలీస్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు ప్రారంభించింది.
పేలుడు ఘటనపై టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది ఉగ్ర చర్యగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సైబర్ ట్రక్ లో అమర్చిన పేలుడు పదార్థం లేదా బాంబ్ కారణంగా పేలుడు సంభవించిందని ఆయన అన్నారు. టెస్లా సీనియర్ టీమ్ దీనిపై దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దర్యాప్తులో తేలే విషయాలను అందరితో పంచుకుంటామని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనను చూడలేదని అన్నారు. పేలుడుకు కారణమైన కారును అద్దెకు తీసుకున్నారని చెప్పారు. ఈ ఘటన పేలుడు పదార్థాల కారణంగా సంభవించిందని... టెస్లా కారు వల్ల జరగలేదని ఆయన పేర్కొన్నారు.