Chandrababu: రేపు హైదరాబాద్ కు వస్తున్న చంద్రబాబు.. కారణం ఇదే!
- రేపటి నుంచి హైదరాబాద్ లో అంతర్జాతీయ తెలుగు మహాసభలు
- మహాసభల ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతున్న చంద్రబాబు
- 3 రోజుల పాటు జరగనున్న మహాసభలు
- ముగింపు కార్యక్రమానికి హాజరు కానున్న రేవంత్ రెడ్డి
- సినీ పరిశ్రమ నుంచి హాజరవుతున్న చిరంజీవి, బాలకృష్ణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు హైదరాబాద్ కు వస్తున్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఈసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సభలు జరగనున్నాయి. హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరగబోయే ఈ సభలకు చంద్రబాబు హాజరుకానున్నారు.
రేపు జరిగే ప్రారంభ కార్యక్రమానికి చంద్రబాబు వస్తున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరుకాబోతున్నారు. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయప్రద, జయసుధ, మురళీమోహన్ తదితరులు రానున్నారు.
తెలుగుదనం ఉట్టిపడేలా ఈ వేడుకలను నిర్వహించబోతున్నారు. కూచిపూడి నృత్య రూపకాలు, జానపద కళాకారుల ప్రదర్శనలు, సినీ సంగీత విభావరి, సినీ కళాకారుల ప్రదర్శనలు, సాహితీ రూపకాలు, భాష, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, తెలుగు చేనేత వస్త్ర ప్రదర్శనలతో పాటు పలు కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. మహాసభలకు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ మహాసభలకు తరలి వస్తున్నారు.