mm keeravani: ఇళయరాజా బాణీకి పాట రాసిన కీరవాణి... ఏ సినిమా అంటే!
- రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా వస్తున్న మూవీ షష్టిపూర్తి
- 38 ఏళ్ల తర్వాత షష్టిపూర్తి మూవీలో జంటగా నటిస్తున్న రాజేంద్రప్రసాద్, అర్చన
- తొలిసారిగా ఇళయరాజా బాణీకి కీరవాణి సాహిత్యం
అస్కార్ విజేత, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తొలిసారిగా అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా బాణీకి పాట రాశారు. ఇప్పటి వరకూ కీరవాణి 60కిపైగా పాటలు రాశారు కానీ ఇళయరాజా బాణీకి పాట రాయడం ఇదే ప్రధమం.
రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న 'షష్టిపూర్తి' సినిమాలో ‘ఏదో ..ఏ జన్మలోదో .. ఈ పరిచయం’ అంటూ సాగే పాటని త్వరలో విడుదల చేయనున్నారు. ఈ పాటనే ఎంఎం కీరవాణి రచించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ.. కీరవాణి ఆస్కార్ అవార్డు స్వీకరించిన తర్వాత రాసిన మొదటి పాట ఇదని చెప్పారు. ఈ మూవీలో ఐదు పాటలు ఉండగా, చైతన్య ప్రసాద్ కొన్ని పాటలకు సాహిత్యం అందించారన్నారు. ప్రత్యేకమైన ఓ సందర్భంలో ఓ పాటకి కీరవాణి సాహిత్యం అందిస్తే బాగుంటుందని భావించి, చైతన్య ప్రసాద్ ద్వారా సంప్రదించగా, ఆయన ఒప్పుకుని ఈ పాట రాశారని చెప్పారు.
ఇళయరాజా బాణీకి కీరవాణి సాహిత్యం అందించడం, అది తమ సినిమాలోని పాట కావడం ఎంతో సంతోషంగా ఉందని పవన్ ప్రభ పేర్కొన్నారు. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే ..లేడీస్ టైలర్ మూవీలో సందడి చేసిన రాజేంద్రప్రసాద్, అర్చన 38 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు.