Crime News: తనిఖీలు చేస్తుండగా కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన కారు

Car ran over the constables while they were checking

  • కాకినాడలోని కృష్ణవరంలో పోలీసుల తనిఖీలు
  • కారును ఆపుతున్నట్టు నటించి పోలీసులను ఢీకొట్టి వెళ్లిన డ్రైవర్
  • కారులో గంజాయి ఉన్నట్టు అనుమానం
  • రాజానగరం సమీపంలో వాహనాన్ని వదిలి పరారైన డ్రైవర్

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పైనుంచి దూసుకెళ్లిందో కారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయర్ వేళ కాకినాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. 

ఈ క్రమంలో అర్ధరాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును ఆపారు. రోడ్డు పక్కన ఆపుతున్నట్టు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగం పెంచి ముందుకు పోనిచ్చాడు. దీంతో వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌ కానిస్టేబుల్ రాజి లోవరాజుతోపాటు మరో కానిస్టేబుల్‌పై నుంచి కారు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, కానిస్టేబుళ్లను ఢీకొట్టి వెళ్లిన కారు డ్రైవర్ రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. డ్రైవర్‌తోపాటు ఇతర నిందితులు పశ్చిమ గోదావరిలో పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. కాగా, నిందితులు వదిలి వెళ్లిన కారు ఉత్తరప్రదేశ్‌లో రిజిస్టర్ అయింది. అందులో గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News