Team India: 2024లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీళ్లే!
- మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రా
- 34 ఇన్నింగ్స్‌లో ఏకంగా 86 వికెట్లు తీసిన స్టార్ పేసర్
- 49 వికెట్లతో రెండవ స్థానంలో నిలిచిన రవీంద్ర జడేజా
- ఆ తర్వాతి వరుస స్థానాల్లో నిలిచిన అశ్విన్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్
భారత క్రికెట్ జట్టుకు గడిచిన ఏడాది 2024 ఎంతో ప్రత్యేకమైనది. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా ముద్దాడింది. అంతేకాదు కీలకమైన ద్వైపాక్షిక సిరీస్‌లను కూడా గెలుచుకుంది. భారత విజయాలలో కీలక పాత్ర పోషించిన బౌలర్లు పెద్ద సంఖ్యలో వికెట్లను కొల్లగొట్టారు. 2024లో టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
34 ఇన్నింగ్స్‌ల్లో బుమ్రా ఏకంగా 86 వికెట్లు సాధించాడు. ఎంత మెచ్చుకున్నా తక్కువే అనేలా అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా తన సత్తా చాటుకున్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 28 ఇన్నింగ్స్‌లో 49 వికెట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచాడు. దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులో ఉన్నప్పటికీ చోటు దక్కించుకొని జడేజా ఈ వికెట్లు సాధించడం విశేషం. అయితే, పరిమితి ఓవర్ల క్రికెట్‌లో జడేజా అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
ఇక ఇటీవలే రిటైర్‌మెంట్ ప్రకటించిన స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ 21 ఇన్నింగ్స్‌ల్లో 47 వికెట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో మాత్రమే ఆడి ఇన్ని వికెట్లు సాధించడం గమనార్హం.
యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ 23 ఇన్నింగ్స్‌ల్లో 40 వికెట్లు తీసి 2024లో అత్యధిక వికెట్లు సాధించిన నాలుగవ భారతీయ బౌలర్‌గా నిలిచాడు. టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత సుందర్ ప్రదర్శన మెరుగుపడుతోంది. అతడికి అవకాశాలు కూడా దక్కుతున్నాయి. రవిచంద్రన్ అశ్విన్‌కు వారసుడిగా మారేలా ఈ యువ ఆటగాడు కనిపిస్తున్నాడు.
ఇక హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ గతేడాది మొత్తం 34 ఇన్నింగ్స్‌ల్లో 40 వికెట్లు తీశాడు. ప్రదర్శన ఎలా ఉన్నా మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకుని టీమిండియాకు కీలక ఆటగాడిగా రాణించాడు.