Raghu Rama Krishna Raju: ప్రకాశం జిల్లా ఎస్పీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ
- రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు
- నాడు రఘురామ గుండెలపై కూర్చుని హింసించిన వ్యక్తి
- ఆ వ్యక్తిని తులసిబాబుగా గుర్తించిన పోలీసులు
- తులసిబాబుకు నోటీసులు పంపిన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్
- విచారణ సమయంలో తాను వచ్చి తులసిబాబును గుర్తిస్తానన్న రఘురామ
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ దర్యాప్తు అధికారిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తికి పోలీసులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.
ఈ క్రమంలో, రఘురామకృష్ణరాజు నేడు ఎస్పీ దామోదర్ కు లేఖ రాశారు. విచారణ సమయంలో తులసిబాబును గుర్తించేందుకు తాను హాజరవుతానని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.
తులసిబాబు ఎవరంటే...
గత ప్రభుత్వ హయాంలో, రఘురామను రాజద్రోహం నేరం కింద అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టడం సంచలనం సృష్టించింది. సీఐడీ కార్యాలయంలో ముసుగు వేసుకుని వచ్చిన కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. రఘురామ గుండెలపై కూర్చున్నది బయటి వ్యక్తి అని, అతడిని తులసిబాబు అనే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అతడికి నోటీసులు పంపారు. తులసిబాబుది గుడివాడ అని తెలుస్తోంది.
అరెస్ట్ చేసేనాటికి రఘురామ గుండెకు స్టెంట్ వేసి ఉన్నారు. దాంతో, తన గుండెలపై ఓ వ్యక్తి కూర్చోవడంతో బాధతో విలవిల్లాడిపోయానని రఘురామ పలు సందర్భాల్లో చెప్పారు.
తులసిబాబు... ఈ కేసులో నిందితుడిగా ఉన్న రిటైర్డ్ సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ కు సన్నిహితుడిగా భావిస్తున్నారు. ఇటీవల పోలీసులు విజయపాల్ ను అరెస్ట్ చేసి విచారించారు. విచారణ సమయంలో విజయలపాల్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే తులసిబాబుకు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.