UP: మ‌నిషి ఒంటరిగా కనబడితే చాలు.. చెంపలు వాయించి పారిపోతున్న‌ యువకుడు.. పోలీసుల విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యం..!

Depressed Meerut Man Goes on Slapping Spree Arrested After Video Goes Viral

  • యూపీలోని మీర‌ట్‌లో ఘ‌ట‌న‌
  • కపిల్‌ కుమార్ అనే యువకుడి వింత‌ ప్రవర్తన
  • ఒంట‌రిగా క‌నిపిస్తున్న వారి చెంప పగులగొడుతున్న వైనం
  • తాజాగా వృద్ధుడిపై దాడి తాలూకు వీడియో వైర‌ల్‌
  • దాంతో క‌పిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తండ్రిని కోల్పోవ‌డం, తల్లి మరో వ్యక్తిని పెళ్లాడడంతో డిప్రెషన్‌లోకి యువ‌కుడు
  • అతను ‘డోపమైన్ రష్’ అనే మానసిక రుగ్మ‌త‌తో బాధపడుతున్న‌ట్లు గుర్తించిన వైద్యులు

ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ యువ‌కుడి వింత‌ ప్రవర్తన‌ అందరినీ విస్తుపోయేలా చేసింది. ఒంటరిగా కనబడితే చాలు.. ప్రతి ఒక్కరి చెంపలు వాయించి పారిపోతున్నాడా యువ‌కుడు. అయితే, ఓ బాధితుడి ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు స‌ద‌రు యువ‌కుడిని పట్టుకున్నారు. అత‌నిపై బీఎన్ఎస్ సెక్ష‌న్ 115 కింద కేసు న‌మోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలోని మీరట్‌కు చెందిన కపిల్‌ కుమార్‌(23) అనే యువకుడి ప్రవర్తనలో గత ఐదారు నెలల నుంచి వింత‌ మార్పులు వచ్చాయి. రోడ్లపై ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని చెంపలు వాయిస్తున్నాడు. బాధితులకు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే తన బైకుపై అక్కడి నుంచి జారుకుంటున్నాడు.

ఇలా ఇప్పటివరకు చాలా మందిని కొట్టాడు. అయితే తాజాగా కపిల్ కుమార్.. రిటైర్డ్ పీసీఎస్ అధికారి చెంప పగులగొట్టాడు. అతను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వెనుక నుంచి వచ్చి.. ఎడమ చేతితో గట్టిగా చెంపపై కొట్టాడు. బాధితుడు వృద్ధుడు కావడంతో కపిల్‌ కుమార్‌ బలంగా కొట్టిన దెబ్బకు కిందపడిపోయాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో వృద్ధుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. 

కపిల్‌ దాడిలో స్వల్పంగా గాయపడ్డ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వృద్ధుడి ఫిర్యాదు మేర‌కు పోలీసులు వెంట‌నే ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడు కపిల్‌ కుమార్‌ అని గుర్తించారు. అనంత‌రం అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.   

మీరట్ నగరం ఎస్‌పీ ఆయుశ్‌ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. "కుమార్‌పై ఇలా ఇత‌రుల‌ను చెంపదెబ్బలు కొట్టడం విష‌యమై మూడు కేసులు ఉన్నాయి. అత‌నిపై బీఎన్ఎస్‌ సెక్షన్ 115 కింద కేసు నమోదు చేయ‌డం జ‌రిగింది. అతను ఐదు సంవత్సరాల క్రితం తన తండ్రిని కోల్పోయాడు. అతని తల్లి ఐదారు నెలల కింద‌ మళ్లీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతను ఇప్పుడు మీరట్‌లోని సూరజ్ కుండ్‌లో తన తల్లి, సవతి తండ్రితో కలిసి ఉంటున్నాడు. అయితే, తండ్రిని కోల్పోవ‌డం, తల్లి మరో వ్యక్తిని పెళ్లాడడంతో డిప్రెషన్‌కి లోన‌య్యాడు. ఆ డిప్రెష‌న్‌లోనే అతను ఇలా అందరినీ కొడుతూ తిరుగుతున్నాడు" అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు.

కాగా, కపిల్ మానసిక పరిస్థితిని పరిశీలించిన వైద్యులు అతను ప్రస్తుతం ‘డోపమైన్ రష్’ అనే మానసిక రుగ్మ‌త‌తో బాధపడుతున్న‌ట్లు గుర్తించారు. అతడికి చికిత్స చాలా అవసరమని చెప్పారు. క‌పిల్‌ను మరికొన్ని రోజులు అలాగే వదిలేస్తే తీవ్ర డిప్రెషన్‌కు గురై.. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దాంతో పోలీసులు తగిన చికిత్స చేయించాలని చెప్పి నిందితుడిని త‌ల్లిదండ్రుల‌కు అప్పగించారు.

  • Loading...

More Telugu News