Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వం వస్తే మమతా బెనర్జీని జైలుకు పంపుతాం: సువేందు అధికారి
- లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రకంపనలు పుట్టించిన సందేశ్ ఖాలీ ఘటన
- మహిళలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారన్న సువేందు అధికారి
- బీజేపీ మిమ్మల్ని కూడా జైలుకు పంపుతుందని వ్యాఖ్య
లోక్ సభ ఎన్నికల సమయంలో సందేశ్ ఖాలీ వివాదంతో పశ్చిమ బెంగాల్ అట్టుడికిన సంగతి తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ లైంగిక వేధింపుల అంశం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టించింది. ఇప్పుడు అదే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ... సందేశ్ ఖాలీలో జరిగిన దురాగతాలపై విచారణ జరుపుతామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మమతా బెనర్జీని జైలుకు పంపేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తామని... ఆమెను కచ్చితంగా జైలుకు పంపుతామని అన్నారు.
సందేశ్ ఖాలీ ఘటనను మరిచిపోవాలని మమతా బెనర్జీ కోరుతున్నారని... కానీ, ఆ ఘటనను ప్రజలు మరిచిపోరని సువేందు అధికారి చెప్పారు. సందేశ్ ఖాలీ మహిళలపై తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపారని... బీజేపీ కూడా మిమ్మల్ని జైలుకు పంపుతుందని అన్నారు. చట్ట ప్రకారం వడ్డీతో కలిపి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. షేక్ షాజహాన్ వంటి బలమైన నేతకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడినందుకు మహిళలపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు.