Swiggy: న్యూ ఇయర్ జోష్.. చిప్స్ ప్యాకెట్ల కోసం భారీగా ఆర్డర్ చేసిన హైదరాబాదీలు
- చిప్స్ కోసం ఏకంగా 2.2 లక్షల మంది ఆర్డర్
- సాయంత్రానికే దాదాపు 5 వేల కండోమ్ ఆర్డర్లు
- ప్రముఖ డెలివరీ యాప్ స్విగ్గీ ఇన్ స్టామార్ట్ వెల్లడి
కొత్త ఏడాదికి హైదరాబాదీలు ఘనంగా స్వాగతం పలికారు. స్పెషల్ ఈవెంట్లు, పార్టీలు, పబ్ లలో డ్యాన్సులతో హంగామా చేశారు. మద్యం గ్లాసుల గలగలలు, డీజే మోతలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా చిప్స్ ప్యాకెట్ల కోసం రికార్డు స్థాయిలో ఆర్డర్లు వచ్చాయని, మంగళవారం రాత్రి 7:30 గంటల వరకు 2.21 లక్షల చిప్స్ ప్యాకెట్లు డెలివరీ చేశామని ప్రముఖ డెలివరీ యాప్ స్విగ్గీ పేర్కొంది. ఈ లెక్కలు కేవలం స్విగ్గీ ఇన్ స్టామార్ట్ కు చెందినవి మాత్రమే. మిగతా యాప్ ల లెక్కలు కూడా కలిపితే ఆర్డర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని స్విగ్గీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇక డిసెంబర్ 31న హైదరాబాదీలు కండోమ్ ప్యాకెట్ల కోసం కూడా భారీగానే ఆర్డర్లు పెట్టారని స్విగ్గీ వెల్లడించింది. ఇన్ స్టామార్ట్ లో నగరవాసుల నుంచి మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు ఏకంగా 4,779 ఆర్డర్లు వచ్చాయని వివరించింది. కాగా, న్యూఇయర్ వేళ వచ్చిన ఆర్డర్లు మదర్స్ డే, వాలెంటైన్స్ డే ఆర్డర్లను అధిగమించాయని చెప్పారు.