Dil Raju: దిల్ రాజు ఆంధ్రాలో సినిమా అభివృద్ధికి పని చేయడం సిగ్గుచేటు: మేడే రాజీవ్ సాగర్
- పరిశ్రమను ఆంధ్రాకు తరలించే టాస్క్‌లో బాగా పని చేస్తున్నారని ఎద్దేవా
- అనవసర రాజకీయాలను ఆపాదించవద్దన్న మేడే రాజీవ్ సాగర్
- పరిశ్రమను కాపాడాలనుకుంటే కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్
- సంధ్య థియేటర్ ఘటనలో తప్పు ఎవరిదో చెప్పాలని నిలదీత
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా ఉన్న దిల్ రాజు ఆంధ్రాలో సినిమా అభివృద్ధికి పని చేయడం సిగ్గుచేటని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను దిల్ రాజు సమర్థిస్తున్నారా? అని నిలదీశారు. ఈ మేరకు ఈరోజు ఓ ప్రకటనను విడుదల చేశారు. పరిశ్రమను ఆంధ్రాకు తరలించే టాస్క్‌లో మీరు బాగా కృషి చేస్తున్నారని దిల్ రాజును ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
సినిమాలకు కేరాఫ్ అడ్రస్ విజయవాడ అని తెగపొగుడుతున్నారని... కానీ సినిమాలకు, విజయవాడకు ఏమైనా సంబంధం ఉందా? అని నిలదీశారు. కేటీఆర్‌ను విమర్శించే ముందు దిల్ రాజు మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను అనవసర వివాదాల్లోకి లాగవద్దంటూ తమకు అనవసర రాజకీయాలను ఆపాదించడం సరికాదన్నారు.
దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ హోదాలో లేఖ రాశారని, ఆ పదవిని కాంగ్రెస్ ఇచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ హోదాలో లేఖ రాసి ఉంటే... పరిశ్రమను కాపాడాలనే ఉద్దేశం ఉందని భావించి ఉండేవాళ్లమని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పదవిలో ఉండి ఆయన లేఖ రాశారన్నారు. చిత్ర పరిశ్రమను కాపాడాలనుకునే ఉద్దేశమే ఉంటే నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలన్నారు.
మంత్రి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? అని నిలదీశారు. ఈ విషయంలో చిత్ర పరిశ్రమ తరఫున మీ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో తప్పు అల్లు అర్జున్‌దా? లేక ప్రభుత్వానిదా? చెప్పాలని ప్రశ్నించారు. కమాండ్ కంట్రోల్ రూంలో మీటింగ్ తర్వాత అల్లు అర్జున్ కేసు ఎందుకు అటకెక్కిందని నిలదీశారు. మీ మధ్య జరిగిన ఒప్పందమేమిటో చెప్పాలన్నారు.