SIT: రేషన్ బియ్యం అక్రమరవాణాపై ఏర్పాటు చేసిన సిట్ లో మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం
- కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా
- ఇటీవల వినీత్ బ్రిజ్ లాల్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు
- సిట్ లోని నలుగురు డీఎస్పీలపై అభ్యంతరాలు
- నలుగురినీ తొలగించిన ఏపీ ప్రభుత్వం
- కొత్త సిట్ లో పౌరసరఫరాల శాఖ అధికారులకు చోటు
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుండడంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో... సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీలు బాలసుందరరావు, అశోక్ వర్ధన్, రత్తయ్య, గోవిందరావులతో ఈ సిట్ ను ఏర్పాటు చేశారు.
అయితే, ఈ సిట్ లోని నలుగురు డీఎస్పీల నియామకం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. వారిపై అభ్యంతరాల నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం తాజాగా ఈ సిట్ లో మార్పులు చేస్తూ కొత్త సిట్ ను ప్రకటించింది.
వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలోనే ఈ కొత్త సిట్ పనిచేస్తుంది. ఇందులో సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వరరావు, బీసీ సంక్షేమశాఖ కాకినాడ ఈడీ శ్రీనివాసరావు, మహిళా శిశుసంక్షేమశాఖ కర్నూలు ఆర్జేడీ రోహిణి, విజయనగరం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మధుసూదన్ రావు, కోనసీమ జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ బాలసరసర్వతి సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా సిట్ లో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఇద్దరు డిప్యూటీ కలెక్టర్ హోదా అధికారులు ఉన్నారు. కొత్త సిట్ లో పౌరసరఫరాల శాఖ అధికారులకు కూడా స్థానం కల్పించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో నమోదైన 13 ఎఫ్ఐఆర్ లపై సిట్ దర్యాప్తు జరపనుంది.