Meenakshi Chaudary: టాప్ ప్లేస్ కి దగ్గరలో మీనాక్షి చౌదరి!
- ఒక్కోమెట్టు ఎక్కుతూ వస్తున్న మీనాక్షి చౌదరి
- 'లక్కీభాస్కర్'తో హిట్ కొట్టిన సుందరి
- పండగ బరిలోకి దిగుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం'
- ఈ సినిమా హిట్ తో ఆమె గ్రాఫ్ పెరగనుందంటున్న ఫ్యాన్స్
తెలుగు తెరపైకి శ్రీలీల, కృతి శెట్టి ఇద్దరూ కూడా రాకెట్ స్పీడ్ తో దూసుకుని వచ్చారు. ఆరంభంలో హిట్లు కొట్టిన ఈ భామలు ఇద్దరూ కూడా ఇప్పుడు ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా చిన్న సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన మీనాక్షి చౌదరి, నిదానంగా కుదురుకుంటూ ఉండటం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పెద్ద హీరోల జోడీగా అవకాశాలు అందుకుంటూ వెళుతుండటం విశేషం.
'గుంటూరు కారం' సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర నామమాత్రంగానే కనిపిస్తుంది. కానీ గ్లామర్ పరంగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమాతోనే. ఇక ఇటీవల వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా హిట్ కావడం కూడా ఆమె కెరియర్ కి హెల్ప్ అయింది. ఈ సినిమాను ఆడియన్స్ ఇంకా మరిచిపోకముందే, వెంకటేశ్ సరసన చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా, ఈ పండుగకి థియేటర్లలో దిగిపోనుంది.
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా పాటలు ఇప్పటికే జనంలోకి దూసుకుని వెళ్లాయి. అటు మాస్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మీనాక్షిని పాత్రకి ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమా హిట్ అయితే ఆమె టాప్ పొజీషన్ కి వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఐశ్వర్య రాజేశ్ కూడా ఈ సినిమా హిట్ అయితే ఇక్కడ కుదురుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.