Chandrababu: నాకు హైకమాండ్ ఎవరూ లేరు: సీఎం చంద్రబాబు
- పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ
- ఇంటింటికీ తిరిగి పింఛన్లు ఇచ్చిన సీఎం చంద్రబాబు
- గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు హాజరు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ (డిసెంబరు 31) పల్నాడు జిల్లా యల్లమందలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి స్వయంగా పింఛన్ లబ్ధిదారులకు నగదు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం చేస్తారని అన్నారు. తనకు హైకమాండ్ అంటూ ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఐదు కోట్ల మంది ప్రజలే నాకు హైకమాండ్ అని పేర్కొన్నారు.
తన జీవితంలో ఎన్నడూ చూడనంత విధ్వంసం గత ఐదేళ్లలో చూశానని వెల్లడించారు. అన్ని వ్యవస్థలను దోపిడీ చేసి నిర్వీర్యం చేశారని, కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి పారిపోయాయని, తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ ఒక్కో కంపెనీ రాష్ట్రంలోకి అడుగుపెడుతున్నాయని వివరించారు. విధ్వంస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందని అన్నారు.
సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే తాటతీస్తానని చంద్రబాబు హెచ్చరించారు. మంచివాళ్లకు మంచిగా ఉంటా... దారి తప్పితే ఊరుకునేది లేదని అన్నారు.
ఇక, నదుల అనుసంధానంతో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తామని, జలహారతి పథకానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తయారుచేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి కష్టాలు రాకుండా అండగా నిలుస్తామని వివరించారు.
తాము అధికారంలోకి రాగానే చెత్తపై పన్ను ఎత్తివేశామని తెలిపారు. గుంతలు లేని రహదారులు ఉన్న రాష్ట్రంగా మార్చే బాధ్యత తమది అని పేర్కొన్నారు. "మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవో నెం.217ని రద్దు చేశాం. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ఇప్పటిదాకా 198 అన్న క్యాంటీన్లు నెలకొల్పాం... అవసరమైతే ఇంకా ఏర్పాటు చేస్తాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.