Gudivada Amarnath: రెండు ఎకరాల చంద్రబాబు వెయ్యి కోట్లు ఎలా సంపాదించారు?: గుడివాడ అమర్ నాథ్
- సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని అమర్ నాథ్ విమర్శ
- తమ పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని వ్యాఖ్య
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. నిరుద్యోగ యువతను మోసం చేశారని దుయ్యబట్టారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు.
రైతులకు ఇస్తామన్న రూ. 20 వేల పెట్టుబడి సాయం ఏమయిందని అమర్ నాథ్ ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమలు చేస్తారని అడిగారు. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇస్తామని చెప్పామని... ఇప్పటి నుంచి ప్రభుత్వంపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు. తమ అధినేత జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మోసాలను ఎండగడతామని అన్నారు.
వైసీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య ఉన్న తేడా ఏమిటనే విషయాన్ని ఈ ఆరు నెలల్లోనే ప్రజలు గుర్తించారని అమర్ నాథ్ చెప్పారు. ఇచ్చిన మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని... కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
తన పాలనలో జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అమర్ నాథ్ కొనియాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని కితాబిచ్చారు. ఐదేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 2.75 లక్షల కోట్లు వేశారని చెప్పారు. త్వరలోనే జగన్ జిల్లాల పర్యటనను చేపడతారని తెలిపారు. తాము చేపడుతున్న ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని చెప్పారు.
దేశంలోనే ధనిక సీఎంగా చంద్రబాబు పేరు సంపాదించారని అమర్ నాథ్ అన్నారు. రెండు ఎకరాల ఆసామి చంద్రబాబు వెయ్యి కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉంగరం, వాచ్ పెట్టుకోనంత మాత్రాన చంద్రబాబుకు ఆస్తులు లేవంటే ఎవరూ నమ్మరని అన్నారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు ముందే స్టీల్ ప్లాంట్ పై తమ వైఖరి ఏమిటో కూటమి ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.