కోహ్లీ, రోహిత్ శర్మలపై నిర్మొహమాట అభిప్రాయం చెప్పేసిన సునీల్ గవాస్కర్
- విరాట్, రోహిత్‌ల భవిష్యత్‌పై సెలక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించిన దిగ్గజ మాజీ క్రికెటర్
- టాప్ ఆర్డర్‌లో ఆడుతూ అవసరమైన సహకారం అందించడంలేదని ఇద్దరిపై విమర్శలు
- బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, ఇతర సెలెక్టర్లు ఆలోచించాలన్న సునీల్ గవాస్కర్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్ల భవిష్యత్తుపై సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గవాస్కర్ సూచించారు. జట్టు పరివర్తన గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో టాప్ ఆర్డర్‌లో ఆడుతున్న సీనియర్ల నుంచి అవసరమైన సహకారం దక్కడం లేదని, దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, ఇతర సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని తాను భావిస్తున్నట్టు గవాస్కర్ చెప్పారు.
‘‘ అంతా సెలెక్టర్లపైనే ఆధారపడి ఉంటుంది. సీనియర్ల నుంచి ఆశించిన సహకారం లేదు. టాప్-ఆర్డర్ సహకారం అందించాలి. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు లోయర్-ఆర్డర్‌ను ఎందుకు నిందించాలి?. సీనియర్లు అందించాల్సిన సహకారం అందడంలేదనేది నిజం’’ అని గవాస్కర్ విశ్లేషించారు. నిజానికి ఆస్ట్రేలియాలో టీమిండియా ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు సీనియర్ల వైఫల్యమే అతిపెద్ద కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. టాప్ ఆర్డర్ సహకారం లేకపోవడంతోనే భారత్ జట్టు సిరీస్‌లో వెనుకబడిందని వ్యాఖ్యానించారు.