Flight Accident: రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో ఇదిగో!
- లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో ఘటన
- ఒకే సమయంలో రెండు విమానాలకు క్లియరెన్స్
- ప్రైవేట్ జెట్‌లో గోంజగ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ టీం
- మరో విమానం టేకాఫ్ అవుతుండటంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెచ్చరిక
- ఘటనపై విచారణకు ఆదేశించిన ఎఫ్ఏఏ
వరుస విమాన ప్రమాదాలు కలవరపెడుతున్న వేళ మరో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. ఓ విమానం రన్‌వేపై ఉండగానే మరో విమానం టేకాఫ్ కావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ భయపడి ‘స్టాప్, స్టాప్, స్టాప్’ అని పైలట్‌ను హెచ్చరించాడు.
వాషింగ్టన్‌కు చెందిన గోంజగ యూనివర్సిటీ మెన్స్ బాస్కెట్ బాల్ జట్టు ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ రన్‌వేపై ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే, వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) దర్యాప్తు ప్రారంభించింది.
లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ సమయంలో రన్‌వే నుంచి రెండో విమానం టేకాఫ్ అవుతుండడంతో రన్‌వేని దాటకుండా ఉండాలని బాస్కెట్ బాల్ జట్టు సభ్యులున్న ‘కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ 563’ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఆదేశించారు. అయితే, అదే సమయంలో ఎంబ్రేయర్ ఈ135 విమానం టేకాఫ్ కావడంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ‘స్టాప్, స్టాప్, స్టాప్’ అని ప్రైవేట్ క్యారియర్ పైలట్‌ను హెచ్చరించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మొదటి విమానం టేకాఫ్ అయిన తర్వాత కాసేపటికి ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయింది.