Noida: మందుబాబులకు నోయిడా పోలీసుల న్యూఇయర్ గిఫ్ట్.. తాగి పడిపోయే వాళ్ల కోసం క్యాబ్ సర్వీసులు!
- నూతన సంవత్సరం వేడుకల కోసం రెడీ అయిన నోయిడా నగరం
- నగరవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
- 3 వేల మంది పోలీసుల మోహరింపు
- నిఘా కోసం డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
- మద్యం మత్తులో ఉన్న వ్యక్తులను వారి ఇళ్లకు చేర్చడానికి క్యాబ్, ఆటో సేవలు
- బార్ అండ్ రెస్టారెంట్ ఆపరేటర్ల మద్దతుతో సేవలు
నూతన సంవత్సరం వేడుకల కోసం దేశంలోని ప్రధాన నగరాలు ఇప్పటికే రెడీ అయ్యాయి. ఆయా నగరాలలోని బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ ఆఫర్లతో సిద్ధంగా ఉన్నాయి. ఇక వేడుకల సందర్భంగా అవాంఛిత ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు సెలబ్రేషన్స్ పై నిబంధనలు విధించారు.
ఈ క్రమంలో నోయిడా పోలీసులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వేడుకల్లో పూటుగా తాగి పడిపోయేవాళ్లను వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చేందుకు క్యాబ్, ఆటో సర్వీసులను ఏర్పాటు చేశారు. మందుబాబులను ఇంటికి పంపడానికి క్యాబ్ సేవలను ఏర్పాటు చేసినట్లు నోయిడా పోలీసు అధికారులు ప్రకటించారు.
బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల సహకారంతో నోయిడా పోలీసులు క్యాబ్, ఆటో సేవలను అందిస్తారని తమ ప్రకటనలో పేర్కొన్నారు. అధిక మత్తులో ఉన్న వ్యక్తులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు.
ఈ ప్రత్యేక ఏర్పాట్ల గురించి నోయిడా డీసీపీ రామ్ బదన్ సింగ్ మాట్లాడుతూ.. "న్యూ ఇయర్ వేడుకలను సురక్షితంగా, సంతోషంగా జరుపుకునేలా డ్రోన్ నిఘా, ప్రత్యేక క్యాబ్, ఆటో సేవలతో సహా విస్తృతమైన భద్రతా చర్యలను అమలు చేస్తున్నాం. అధికంగా మద్యం సేవించిన వారు ఇంటికి చేరుకోవడంలో సహాయం చేస్తారు. బార్ అండ్ రెస్టారెంట్ ఆపరేటర్ల మద్దతుతో ఈ సేవలను అందిస్తున్నాం" అని చెప్పారు.
మద్యం మత్తులో ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు రాత్రిపూట అద్దె క్యాబ్‌లను ఏర్పాటు చేస్తారని డీసీపీ తెలిపారు. దీనికోసం వివిధ మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లలోని హెల్ప్‌డెస్క్‌ల వద్ద పోలీసులను మోహరిస్తామని ఆయన చెప్పారు. మత్తులో ఉన్న వ్యక్తులను కార్లు, బైక్‌లు నడపడానికి పోలీసులు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరని అన్నారాయన.
న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో భద్రత కోసం నోయిడా పోలీసులు కీలక ప్రాంతాల్లో 3,000 మంది సిబ్బందిని మోహరించారు. ప్రముఖ మాల్స్, నైట్ లైఫ్ హబ్‌లు వంటి అధిక ట్రాఫిక్, రద్దీ ప్రాంతాలలో ప్రత్యేకంగా 6వేలకు పైగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లను ఏర్పాటు చేసినట్లు రామ్ బదన్ సింగ్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు సీనియర్ పోలీసు అధికారులు, డాగ్ స్క్వాడ్లు, బాంబు నిర్వీర్య బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు పేర్కొన్నారు.