Rohit Sharma: రిటైర్‌మెంట్‌కు సిద్ధమైన రోహిత్ శర్మ!.. బీసీసీఐ సెలెక్టర్లు, పెద్దలతో సంప్రదింపులు పూర్తి!
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ మ్యాచ్ తర్వాత ప్రకటన!
- నిర్ణయాన్ని బీసీసీఐ పెద్దలకు తెలియజేసిన హిట్‌మ్యాన్
- రోహిత్ మనసు మార్చుకునే అవకాశం లేనట్టే
- ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆసక్తికర కథనం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరిదైన 5వ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. రిటైర్‌మెంట్ ప్రకటనకు హిట్‌మ్యాన్ సిద్ధంగా ఉన్నాడని, తన నిర్ణయం గురించి బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లతో ఇప్పటికే మాట్లాడాడని, రోహిత్ తన మనసు మార్చుకునే అవకాశం ఉండకపోవచ్చని కథనం పేర్కొంది.
వీడ్కోలు ప్రకటనకు సంబంధించి నిర్దిష్ట సమయాన్ని పేర్కొనలేదు. కానీ, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరగనున్న చివరి టెస్ట్ మ్యాచ్ తర్వాత ఈ ప్రకటన ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధిస్తే అప్పటివరకు కొనసాగుతానంటూ సెలెక్టర్లను రోహిత్ శర్మ కోరనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2024లో ఇప్పటివరకు మూడు టెస్టుల్లో రోహిత్ శర్మ మొత్తం కలిపి 31 పరుగులు మాత్రమే సాధించాడు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో 30 వికెట్లు తీశాడు. మరొక్క వికెట్ సాధిస్తే రోహిత్ శర్మ పరుగులతో సమానమవుతాయంటూ కెప్టెన్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో భారత క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మను ట్రోలింగ్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం కెప్టెన్‌పై ప్రదర్శనపై పెదవి విరుస్తున్నారు.