Rohit Sharma: రోహిత్ శర్మ జట్టులో ఉండడం అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్
- ఇటీవల బ్యాటింగ్ లో విఫలమవుతున్న రోహిత్ శర్మ
- కెప్టెన్ గానూ వైఫల్యం
- కెప్టెన్ కాబట్టే జట్టులో స్థానం ఇస్తున్నారన్న ఇర్ఫాన్ పఠాన్
బ్యాటింగ్ లో తడబడుతున్న రోహిత్ శర్మ, కెప్టెన్ గానూ విఫలమవుతున్నాడు. ఇటీవల బ్యాట్స్ మన్ గా రోహిత్ శర్మ గణాంకాలు ఏమంత సంతృప్తికరంగా లేవు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టును జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో నెగ్గిన టీమిండియా... ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు టెస్టుల్టో ఓటమిపాలైంది. ఓ టెస్టు డ్రా అయింది.
వ్యక్తిగత ఫామ్ విషయానికొస్తే రోహిత్ శర్మ కనీసం డబుల్ డిజిట్ స్కోరు చేస్తే గొప్ప అన్నట్టుగా పరిస్థితి తయారైంది. గోరు చుట్టుపై రోకటి పోటులా ఇవాళ ముగిసిన నాలుగో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. దాంతో రోహిత్ శర్మపై విమర్శలు ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలో, టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత ఇర్ఫాన్ పఠాన్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ జట్టులో ఉండడం అవసరమా... అతడు లేకపోతేనే టీమిండియా తుది జట్టుకు కచ్చితమైన రూపు వస్తుంది అని స్పష్టం చేశాడు.
"రోహిత్ జట్టులో లేకపోతే... కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా... శుభ్ మాన్ గిల్ వన్ డౌన్ లో వచ్చేవారు. కెప్టెన్ కాబట్టే రోహిత్ శర్మ జట్టులో కొనసాగుతున్నాడు... కెప్టెన్ కాకపోయుంటే అతడ్ని తుది జట్టుకు ఎంపిక చేస్తారునుకోవడంలేదు" అంటూ ఇర్ఫాన్ పఠాన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. గత 10 ఇన్నింగ్స్ ల్లో చూస్తే రోహిత్ శర్మ సగటు 11 లోపే కావడం ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలకు బలం చేకూర్చుతోంది.
కాగా, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ముగిశాక కెరీర్ విషయంలో రోహిత్ శర్మ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడని అభిప్రాయపడ్డాడు.