G. Kishan Reddy: సాధారణ కాంగ్రెస్ కార్యకర్తకు దక్కిన గౌరవం కూడా పీవీకి దక్కలేదు: కిషన్ రెడ్డి
- పీవీ అంతిమ సంస్కారాలు ఢిల్లీలో జరపొద్దని సోనియా హుకుం జారీ చేశారన్న కేంద్రమంత్రి
- మన్మోహన్ కుటుంబాన్ని ప్రధాని మోదీ ఓదార్చారన్న కిషన్ రెడ్డి
- మన్మోహన్ సింగ్ మరణాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శ
తెలంగాణవాడైన పీవీ నర్సింహారావు పట్ల సోనియా గాంధీ అమర్యాదగా ప్రవర్తించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సాధారణ నాయకుడికి దక్కిన గౌరవం కూడా మన తెలంగాణ బిడ్డ పీవీకి ఆనాడు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీ అంతిమ సంస్కారాలు ఢిల్లీలో జరపడానికి వీల్లేదని సోనియా నాడు హుకుం జారీ చేశారని మండిపడ్డారు. పీవీ నర్సింహారావు భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు పంపించారన్నారు.
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు. తాను కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన వీల్ చైర్‌లో రాజ్యసభకు వచ్చారని తెలిపారు. ఎన్నోసార్లు మన్మోహన్ సింగ్‌కు నమస్కరించే అవకాశం తనకు దక్కిందన్నారు. ఎన్నో ఒత్తిళ్ల మధ్య ఆయన పదేళ్లు ప్రధానిగా పని చేశారని ప్రశంసించారు.
మన్మోహన్ సింగ్ మరణాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాజపేయికి ఏర్పాటు చేసినట్లుగానే మన్మోహన్ సింగ్‌కు కూడా స్మారక కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారన్నారు. కేంద్రాన్ని, మోదీని విమర్శించే నైతిక అర్హత రాహుల్ గాంధీకి లేదన్నారు.