SC Categorisation: ఎస్సీ వర్గీకరణపై గుంటూరులో అభిప్రాయ సేకరణ జరిపిన ఏకసభ్య కమిషన్

One man commission orgainise referendum on SC Categorisation in Guntur

  • ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ
  • నేడు గుంటూరు కలెక్టరేట్ లో కార్యక్రమం
  • హాజరైన వివిధ సామాజిక వర్గాల నేతలు
  • అభిప్రాయాలు తెలిపిన పిల్లి మాణిక్యాలరావు, డొక్కా మాణిక్యవరప్రసాద్, మంద కృష్ణ

ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా నేడు గుంటూరు కలెక్టరేట్ లో అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతిపత్రాలు అందించారు. 

లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ, గత పాలకులు కొన్ని కులాలను భుజాన వేసుకున్నారని, తద్వారా మిగిలిన కులాల వారికి రిజర్వేషన్ల ఫలాలను దూరం చేశారని విమర్శించారు. ఆయా కులాలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా మేలు చేసేందుకు చంద్రబాబు ముందుకొచ్చారని తెలిపారు. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందితేనే అంబేద్కర్ కల నిజమవుతుందని అన్నారు. 

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందిస్తూ... మాదిగలు రిజర్వేషన్ ఫలాలను తక్కువగా పొందుతున్నారని వివరించారు. ఎస్సీ వర్గీకరణ చేయడమే న్యాయబద్ధం అని స్పష్టం చేశారు. దీనిపై మాలలు, మాదిగలు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారని అనుకుంటున్నట్టు తెలిపారు. మాదిగలకు అన్యాయం జరిగిందని మాలలు కూడా చెప్పడం గమనార్హం అని డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వెనుకబడిన అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. త్వరితగతిన వర్గీకరణ చేసి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఇటీవల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా సభ్యుడిగా ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. గత కొన్ని రోజులుగా రాజీవ్ రంజన్ మిశ్రా వివిధ జిల్లా కేంద్రాల్లో అభిప్రాయసేకరణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News