Srikanth Odela: చిరంజీవితో సినిమాపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు
- ఇటీవలే చిరుతో అధికారికంగా ప్రాజెక్టును ప్రకటించిన శ్రీకాంత్ ఓదెల
- ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని వ్యాఖ్య
- ఇందులో చిరంజీవిని కొత్త అవతార్‌లో చూస్తారని వెల్లడి
- మూవీలో ఆయన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందన్న యువ దర్శకుడు
మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవలే అధికారికంగా ఈ ప్రాజెక్టుపై ప్రకటన కూడా వెలువడింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీని ఉద్దేశించి శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ఇక చిరుకు ఈ యువ డైరెక్టర్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే.
చిరంజీవితో చిత్రంపై శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ... "చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇవాళ ఆయనతో పనిచేస్తున్నానంటే నమ్మలేకపోతున్నాను. ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. చిరంజీవి మునుపటి సినిమాలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది. అంతేగాక ఆయనను ఇందులో కొత్త అవతార్‌లో చూస్తారు. మూవీలో ఆయన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుంది.
సుమారు 48 గంటల్లోనే తాము ఈ సినిమా స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసేశాం. చిరు ఉత్సుకత నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఇక ఆయన కారవాన్ నుంచి బయటకు వచ్చేవరకే నేను ఆయన అభిమానిని. ఒక్కసారి సెట్‌లోకి అడుగుపెట్టారంటే నా మూవీలో ఆయన ఒక పాత్ర మాత్రమే" అని శ్రీకాంత్ ఓదెల అన్నారు.
ఇక నానితో తాను తెరకెక్కించిన మొదటి సినిమా 'దసరా' కథకు తన తండ్రే స్ఫూర్తి అని అన్నారు. చిన్నతనంలో తన తండ్రి బొగ్గుగనుల్లో పని చేయడానికే వెళ్లేవారని, ఆ స్ఫూర్తితోనే ఈ మూవీ స్టోరీ రాసినట్లు తెలిపారు. కాగా, 2019లో విడుదలైన 'బ్రోచేవారెవరురా' చిత్రం చూసిన తర్వాత తన మనసు మార్చుకున్నానని, సినిమాల్లోకి అడుగుపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వెంటనే తన సర్టిఫికేట్స్ అన్నీ తగలపెట్టేశానని ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద మొదట శ్రీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత 2023లో వచ్చిన 'దసరా' మూవీతో దర్శకుడిగా మారారు. అలా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం తన రెండో సినిమా కూడా నానితోనే చేస్తున్నారు. 'ది ప్యారడైజ్' పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత చిరుతో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు.