Pawan Kalyan: నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాలి... ఆ తర్వాతే మంత్రి పదవి: పవన్ కల్యాణ్
- నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం
- ఎమ్మెల్సీ కాకుండా మంత్రి పదవి ఇచ్చేంత ప్రత్యేక పరిస్థితులు లేవన్న పవన్
- అందుకే నాగబాబుకు ఎమ్మెల్సీ పదవిపై దృష్టి సారిస్తామని వెల్లడి
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తన సోదరుడు నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాల్సి ఉందని, ఆ తర్వాతే మంత్రి పదవి గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.
ప్రత్యేక పరిస్థితులు ఉంటేనే... ఎమ్మెల్సీ కాకముందే మంత్రి పదవి ఇస్తారని, ఇప్పుడలాంటి ప్రత్యేక పరిస్థితులేవీ లేవని తెలిపారు. కాబట్టి, ముందు నాగబాబును ఎమ్మెల్సీ చేయడంపై దృష్టి సారిస్తామని పవన్ వెల్లడించారు.
ఇక్కడ కులం, బంధుప్రీతి ముఖ్యం కాదని... పనిమంతుడా, కాదా అన్నదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. తమ మంత్రివర్గంలో ఉన్న కందుల దుర్గేశ్ కులం ఏంటో తనకు ఇప్పటివరకు తెలియదన్నారు. నాగబాబు కష్టించి ఎదిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.