Australia vs India: బాక్సింగ్ డే టెస్టు.. ఆసీస్ 234 ఆలౌట్.. భారత్ ముందు భారీ లక్ష్యం!
- మెల్‌బోర్న్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు
- టీమిండియా ముందు 340 పరుగుల భారీ టార్గెట్
- 5 వికెట్లతో రాణించిన జస్ప్రీత్ బుమ్రా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 234 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని భారత్ ముందు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 228/9 తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 6 రన్స్ జోడించి చివరి వికెట్ కోల్పోయింది. పదో వికెట్ కు బొలాండ్, నాథన్ లైయన్ ద్వయం ఏకంగా 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీ (70) తో రాణించగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 41, నాథన్ లైయన్ 41 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. అలాగే మహ్మద్ సిరాజ్ 3, రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆచితూచి ఆడుతోంది. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 21/0. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (07), యశస్వి జైస్వాల్ (10) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 319 పరుగులు కావాలి.