Game Changer: విజయవాడలో 256 అడుగుల ఎత్తయిన రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరణ
- విజయవాడలో 256 అడుగుల ఎత్తయిన రామ్ చరణ్ కటౌట్
- ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దిల్ రాజు
- గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నామని వెల్లడి
- పవన్ ను కలిసి డేట్ ఫిక్స్ చేస్తామని వివరణ
విజయవాడలో గ్లోబల్ స్టార్ అభిమానులు ఏర్పాటు చేసిన 256 అడుగుల ఎత్తయిన రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఆకాశాన్నంటేలా ఉన్న రామ్ చరణ్ కటౌట్ చూసి దిల్ రాజు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా చరణ్ ఫ్యాన్స్ ను అభినందించారు. కాగా, రామ్ చరణ్ కటౌట్ పై హెలికాప్టర్ పూలవర్షం కురిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఆ సంస్థ ప్రతినిధుల నుంచి దిల్ రాజు అవార్డు తాలూకు సర్టిఫికెట్ అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో దిల్ రాజు ప్రసంగిస్తూ ఆసక్తికర అంశం వెల్లడించారు. ఇవాళ తాను విజయవాడ వచ్చింది రామ్ చరణ్ కటౌట్ కార్యక్రమం కోసమే కాకుండా, మరో పని మీద కూడా వచ్చానని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవడానికి వచ్చానని వివరించారు.
అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో అందరూ చూశారని, ఇక పవన్ కల్యాణ్ హాజరయ్యే ఈవెంట్ ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోవాలని అన్నారు. దాని గురించి మాట్లాడ్డానికి వచ్చానని దిల్ రాజు పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ గారు ఇచ్చే డేట్ ను బట్టి గేమ్ చేంజర్ ఈవెంట్ ఎక్కడ జరపాలనేది ప్లాన్ చేసుకుంటామని తెలిపారు.
"అయితే కల్యాణ్ గారు హాజరయ్యే ఆ ఈవెంట్ మామూలుగా ఉండకూడదు. ఆ ఈవెంట్ తో ఒక చరిత్ర క్రియేట్ చేయాలి" అని దిల్ రాజు వివరించారు.