Plane Crash: దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం.. కుప్పకూలిన విమానం.. పెద్ద సంఖ్యలో మృతులు.. వీడియో ఇదిగో!
- మువాన్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో ప్రమాదం
- 62 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- ప్రమాద సమయంలో విమానంలో 181 మంది
- ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో ప్రమాదం జరిగినట్టు అనుమానాలు
దక్షిణకొరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ సమయంలో ఓ విమానం అదుపుతప్పింది. రన్ వే చివరికి దూసుకెళ్లి గోడను ఢీ కొట్టింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడి పేలిపోయింది. సౌత్ జియోల్లా ప్రావిన్స్‌లోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం జరిగిందీ ఘోరం. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో పాటు మొత్తం 181 మంది ప్యాసింజర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందులో 62 మంది మృతి చెందినట్టు తేల్చారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది.
థాయ్‌లాండ్ నుంచి వచ్చిన ‘జెజు ఎయిర్ ఫ్లైట్ 2216’ ఈ ప్రమాదానికి గురైంది. ఎయిర్‌పోర్ట్ ఎమర్జెన్సీ సిబ్బంది తక్షణమే రెస్క్యూ చర్యలు చేపట్టి మంటలను ఆర్పివేశారు. కాగా, విమానం ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతోనే విమాన ప్రమాదానికి కారణమని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.