Chandrababu: వైద్య ఆరోగ్య శాఖలో కీలక ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం

CM Chandrababu reviews on health and medical dept
  • వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు పచ్చజెండా
  • 104 అంబులెన్స్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు 
ఏపీ సీఎం చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలో పలు కీలక ప్రతిపాదనలకు ఆయన ఆమోదం తెలిపారు. 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు పచ్చజెండా ఊపారు. ఇందుకు రూ.60 కోట్ల వ్యయం కానుంది. 108 డ్రైవర్లకు జీతంతో పాటు అదనంగా రూ.4 వేలు ఇచ్చే విధానాన్ని మళ్లీ తీసుకురావాలని సీఎం నిర్ణయించారు. 

పేదలు ఆసుపత్రుల్లో చనిపోతే వారి మృతదేహాలను తరలించే మహాప్రస్థానం వాహనాల సంఖ్యను మరింత పెంచేందుకు ఆమోదం తెలిపారు. ఇక, ఎన్టీఆర్ బీమా విధానంలో రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించే పథకం అమలు చేయాలన్న ప్రతిపాదనకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ప్రస్తుతానికి ట్రస్టు విధానంలో ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని బీమా విధానంగా మలిచేందుకు ఉన్న అవకాశాలపై నేటి సమీక్షలో చర్చించారు. 

గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు 104 అంబులెన్స్ ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ అంబులెన్స్ ల్లో ల్యాబ్ టెక్నీషియన్ ను నియమించి, పలు రకాల వైద్య పరీక్షలు చేసే సౌకర్యాన్ని మళ్లీ కల్పించాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో... 108, 104, ఎన్టీఆర్ బీమా పథకం సేవలను ఒకే కాల్ సెంటర్ ద్వారా నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చనుంది. ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు నేటి సమీక్షలో అధికారులతో చర్చించారు. 

ఇక, ప్రివెంటివ్ హెల్త్ కేర్ పై శ్రద్ధ చూపించాలని, 104 వాహనాల ద్వారా రక్త పరీక్షలు, ఇతర సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించే విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వమే ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి హెల్త్ కార్డులు ఇచ్చే విధానం తీసుకువస్తే మంచి ఫలితాలు ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు. 

వైద్య రంగంలో ఏఐ సాంకేతికత సేవలు ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, అనారోగ్యంతో బాధపడే ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా, టెక్నాలజీ ద్వారా వైద్య సాయం పొందే విధానం రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.
Chandrababu
Health and Medical Dept
Review
TDP-JanaSena-BJP Alliance

More Telugu News