Nitish Kumar: నితీశ్ కుమార్ రెడ్డికి సునీల్ గవాస్కర్ కీలక సూచన!

Gavaskar suggests Nitish Reddy dont take cricket lightly as granted

  • నితీశ్ కుమార్ రెడ్డి మరిన్ని సెంచరీలు చేయబోతున్నాడని జోస్యం
  • పరిస్థితులకు అనుగుణంగా ఆడగలనని నిరూపిస్తున్నాడని కితాబు
  • తల్లిదండ్రులు చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలని సూచన
  • క్రికెట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని సూచన

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ 176 బంతుల్లో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో పది ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపిస్తూనే ఓ సూచన చేశారు.

నితీశ్‌కు ఇది టెస్టుల్లో తొలి సెంచరీ అన్నారు. సమీప భవిష్యత్తులో అతను మరిన్ని సెంచరీలు చేయబోతున్నాడన్నారు. భవిష్యత్తులో అతను మరెన్నో సెంచరీలు చేయాలని ఆకాంక్షించారు. మెల్‌బోర్న్‌లో అతను చేసిన సెంచరీ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ సెంచరీలలో ఒకటిగా నిలవాలన్నారు. నితీశ్ రెడ్డి పరిస్థితులకు అనుగుణంగా ఆడగలనని నిరూపించగలుగుతున్నాడని ప్రశంసించారు. అతని షాట్ సెలక్షన్ కూడా అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు.

తల్లిదండ్రులు చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలి

నితీశ్ కుమార్ రెడ్డిని ప్రశంసించిన గవాస్కర్... ఓ కీలక సూచన కూడా చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఈ స్థాయికి చేరుకోవడానికి అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో త్యాగం చేసి ఉంటారని, దానిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు. భారత క్రికెట్ కారణంగా ఈ గుర్తింపు దక్కిందని, కాబట్టి ఈ ఆటను అతను తేలిగ్గా తీసుకోవద్దని హితవు పలికారు. నితీశ్ ఇదే ఆటతీరును కొనసాగిస్తే అద్భుతమైన కెరీర్ అతని సొంతమవుతుందన్నారు.

  • Loading...

More Telugu News