Manmohan Singh: మన్మోహన్ సింగ్ కన్నుమూతపై అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ సంతాపం.. ప్రత్యేక ప్రకటన విడుదల
- మన్మోహన్ సింగ్ నిజమైన రాజనీతిజ్ఞుడన్న బైడెన్
- భారత్-అమెరికా సంబంధాలను అపూర్వ స్థాయికి తీసుకెళ్లారని కితాబు
- ఆయన లేకుంటే నేటి సహకారం సాధ్యమయ్యేది కాదని వ్యాఖ్య
- భారతదేశ ప్రజలతో పాటు తాను, తన భార్య కూడా దుఃఖిస్తున్నామంటూ సంతాపం
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూతపై ప్రపంచ దేశాధినేతలు సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శనివారం సంతాప సందేశాన్ని విడుదల చేశారు. మన్మోహన్ సింగ్ నిజమైన రాజనీతిజ్ఞుడు అని బైడెన్ కొనియాడారు. ఆయన వ్యూహాత్మక ముందుచూపు, రాజకీయ ధైర్యంతో భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని అపూర్వ స్థాయికి చేర్చారంటూ కొనియాడారు.
‘‘మన్మోహన్ సింగ్ వ్యూహాత్మక విజన్, రాజకీయ ధైర్యం లేకుంటే భారత్-అమెరికా మధ్య సహకారం ఈ స్థాయిలో ఉండడం సాధ్యం కాదు. ఆయనను కోల్పోయిన ఈ కష్టకాలంలో భారత ప్రజలతో పాటు నేను, నా భార్య జిల్ బైడెన్ కూడా దుఃఖిస్తున్నాం. మన్మోహన్ సింగ్ దార్శనికతను గుర్తుచేసుకుంటున్నాం. మన్మోహన్ భార్య గురుశరణ్ కౌర్, వారి ముగ్గురు పిల్లలు, భారతదేశ ప్రజలందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని బైడెన్ ప్రకటించారు.
అమెరికా-భారత పౌర అణు ఒప్పందం నుంచి ఇండో-పసిఫిక్ భాగస్వామ్య దేశాల మధ్య క్వాడ్ కూటమిని ఏర్పాటు చేయడం వరకు, రాబోయే తరాల కోసం ఇరు దేశాలను, ప్రపంచాన్ని పటిష్ఠం చేయడంలో పురోగతికి ఆయన బాటలు వేశారని గుర్తుచేశారు. అంకితభావం ఉన్న ప్రజాసేవకుడని, అన్నింటికంటే దయాగుణం, వినమ్రత కలిగిన వ్యక్తి అని జో బైడెన్ కొనియాడారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.