Azerbaijan Plane Crash: అజర్ బైజాన్ విమాన ప్రమాదానికి ఉక్రెయిన్ కారణం అంటున్న రష్యా
- పశ్చిమ కజకిస్థాన్ లో కూలిపోయిన విమానం
- 38 మంది ప్రయాణికులు దుర్మరణం
- గ్రోజ్నీ నగరంలో దిగేందుకు విఫలయత్నం చేసిన పైలెట్
- అక్తావు ఎయిర్ పోర్టులో దిగే ప్రయత్నంలో ప్రమాదం
అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానం పశ్చిమ కజకిస్థాన్ లో కూలిపోవడం తెలిసిందే. బాకు నుంచి గ్రోజ్నీ వెళుతున్న ఆ విమానంలో మొత్తం 67 మంది ఉండగా, 38 మంది దుర్మరణం పాలయ్యారు. 29 మంది గాయాలతో బయటపడ్డారు.
కాగా, ఈ విమాన ప్రమాదానికి ఉక్రెయిన్ కారణమని రష్యా ఆరోపించింది. గ్రోజ్నీ నగరంలో అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండయ్యే సమయంలో, నగరంపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడికి పాల్పడ్డాయని వెల్లడించింది. దాంతో ఆ విమానం గ్రోజ్నీలో ల్యాండ్ కాలేకపోయిందని, ఆ తర్వాత కాసేపటికే కజకిస్థాన్ లో కుప్పకూలిపోయిందని రష్యా పౌర విమానయాన శాఖ చీఫ్ దిమిత్రీ యద్రోవ్ వివరించారు. ఉక్రెయిన్ సైనిక డ్రోన్లు పౌర వ్యవస్థలపైనా ఉగ్రదాడులు చేపడుతున్నాయని యద్రోవ్ పేర్కొన్నారు.
ఆ విమానం రాకకు ముందు గ్రోజ్నీ నగరంలో దట్టమైన పొగ అలముకుని ఉందని, ఆ సమయంలో విమానాశ్రయం వద్ద పరిస్థితులు అత్యంత ప్రతికూలంగా ఉన్నాయని తెలిపారు.
కూలిపోకముందు అజర్ బైజాన్ విమానం రెండు సార్లు ల్యాండింగ్ కు విఫలయత్నాలు చేసిందని తెలిపారు. దాంతో, రెండు ప్రత్యామ్నాయ ఎయిర్ పోర్టులను అధికారులు సూచించినప్పటికీ ఆ పైలెట్ అక్తావు ఎయిర్ పోర్టులోనే విమానాన్ని దించేందుకు ప్రయత్నించాడని వివరించారు.
మరోవైపు, అజర్ బైజాన్ విమానం కూలిపోయిన ఘటనకు రష్యానే బాధ్యత వహించాలని ఉక్రెయిన్ అంటోంది.