Manmohan Singh: మన్మోహన్ బీఎండబ్ల్యూ కారు వద్దని మారుతి-800నే కోరుకున్నారు: యూపీ మంత్రి అసిమ్ అరుణ్
- కన్నుమూసిన మన్మోహన్ సింగ్
- ఆయనతో తన జ్ఞాపకాలు పంచుకున్న యూపీ మంత్రి అసిమ్ అరుణ్
- అసిమ్ అరుణ్ గతంలో ఐపీఎస్ అధికారి
- మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు భద్రతాధికారిగా పనిచేసిన వైనం
ఎన్నో సుగుణాలు ఒక వ్యక్తిలో ఉంటే అది మన్మోహన్ సింగ్ అని రాజకీయ పార్టీలకు అతీతంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కీర్తిస్తున్నారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో, ఆయనతో తమ అనుబంధాన్ని, ఆయన గొప్పదనాన్ని... ముఖ్యంగా ఆయన నిరాడంబరతను నేతలు తాజాగా అందరితో పంచుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అసిమ్ అరుణ్ కూడా మన్మోహన్ గురించి ఆసక్తికర అంశం వెల్లడించారు. అసిమ్ అరుణ్... గతంలో ఐపీఎస్ అధికారి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కాగా, మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో అసిమ్ అరుణ్ ఆయనకు భద్రతాధికారిగా వ్యవహరించారు.
ఓసారి... ప్రధాని కాన్వాయ్ బయల్దేరిందని, ఆ కాన్వాయ్ లో ఎంతో విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారు కూడా ఉందని అరుణ్ వెల్లడించారు. అయితే, అంత ఖరీదైన కారును సైతం మన్మోహన్ వద్దన్నారని, తాను మారుతి-800 కారులోనే వస్తానని చెప్పడంతో అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారని వివరించారు.
"అసిమ్... నాకు ఈ కారులో (బీఎండబ్ల్యూ) ప్రయాణించడం ఇష్టముండదు... నా కారు మారుతి-800 అని చెప్పేవారు. ఎప్పుడు కాన్వాయ్ తీయాల్సి వచ్చినా ఆయన కళ్లు మారుతి కారు కోసం వెతికేవి" అని అసిమ్ అరుణ్ వెల్లడించారు.
తన మధ్య తరగతి మూలాలను ఆయన మర్చిపోయేవారు కాదని, సామాన్యుడి పట్ల తన నిబద్ధతను తన చర్యల ద్వారా చాటిచెప్పేవారని వివరించారు. ప్రధాని హోదాకు తగిన విధంగా ఘనంగా ఉండాలంటే బీఎండబ్ల్యూ కారే సరైనది... కానీ ఆయన తన హృదయంలో మారుతి కారుకే స్థానం ఇచ్చారు అని అసిమ్ అరుణ్ తెలిపారు.