Manmohan Singh: ఇదీ ఆయన గొప్పతనం... గుడ్ బై ఫ్రెండ్... మై భాయ్ మన్మోహన్: మలేషియా ప్రధాని ట్వీట్
- తాను జైల్లో ఉన్నప్పుడు తన కొడుక్కి స్కాలర్‌షిప్ ఆఫర్ చేశాడన్న మన్మోహన్ సింగ్
- ఆయనతో నా జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉండిపోతాయన్న మలేషియా ప్రధాని
- భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని ప్రశంస
ఓ కేసులో తాను జైలుకు వెళ్లినప్పుడు మన్మోహన్ సింగ్ తన కొడుక్కి స్కాలర్‌షిప్‌లు ఆఫర్ చేశారని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం గుర్తు చేసుకున్నారు.
ఇలాంటి సమయంలో మలేషియన్లకు ఓ విషయం చెప్పాలని, అయితే ఇది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినదని పేర్కొన్నారు. తాను జైల్లో ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ తన పట్ల ఎంతో దయ చూపారని, తన తనయుడికి స్కాలర్‌షిప్ ఆఫర్ చేశాడని, కానీ దానిని తాను తిరస్కరించానన్నారు. కానీ ఇది ఆయనలో మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. తాను జైల్లో ఉన్న చీకటి రోజుల్లో నిజమైన స్నేహితుడిగా అండగా నిలిచారని పేర్కొన్నారు.
ఆయన గొప్ప వ్యక్తి అని, ఆయనతో జ్ఞాపకాలు తన హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉండిపోతాయని పేర్కొన్నారు. 'గుడ్ బై ఫ్రెండ్.. మై భాయ్, మన్మోహన్' అంటూ తుది వీడ్కోలు పలికారు.
మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కొంతమంది మన్మోహన్ సింగ్ చేసిన పనులను గుర్తు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మలేషియా ప్రధాని తాను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన్మోహన్ తన కుటుంబానికి స్కాలర్‌షిప్ ఆఫర్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
మన్మోహన్ సింగ్‌లో మానవీయ కోణం దాగి ఉందని పేర్కొన్నారు. మన్మోహన్ వంటి గొప్ప మిత్రుడు మరణించారనే వార్త తనను కలిచివేసిందని రాసుకొచ్చారు. భారతదేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఆయన కీర్తి గడించారని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ ఆర్థిక దిగ్గజాల్లో భారత్ ఆవిర్భవించడంలో ప్రధానిగా ఆయన పాత్ర ఉందని పేర్కొన్నారు.
1990వ దశకంలో తాను, మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రులుగా పని చేశామని, ట్రాన్స్‌ఫార్మేటివ్ విధానాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం తనకు దక్కిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే అంశాలను తాము పంచుకున్నట్లు వెల్లడించారు. ఓ ప్రధానమైన కేసును వెలికి తీయడంలోనూ తాము సహకరించుకున్నామని తెలిపారు. రాజకీయ నేతగా ఆయన కాస్త ఇబ్బందిపడినప్పటికీ దృఢ సంకల్పం కలిగిన గొప్ప రాజనీతిజ్ఞుడన్నారు. రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వాన్ని ఆయన కొనసాగించారన్నారు. భావితరాలకు ఆయన స్ఫూర్తిదాయక నేత అని రాసుకొచ్చారు.