Steve Smith: మెల్‌బోర్న్ సెంచరీతో టెస్టు క్రికెట్ చరిత్రలో స్మిత్ రికార్డుల వరద!

Steve Smith Creates History And Becomes First Player In The World

  • మెల్‌బోర్న్‌లో భారీ శతకం సాధించిన స్మిత్
  • 34 టెస్టు సెంచరీలతో గవాస్కర్ సరసన చోటు
  • టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లపై పదికి పైగా సెంచరీలు సాధించిన ఆటగాడిగా స్మిత్ పేరు
  • వన్డేల్లో సాధించిన 12 శతకాల్లో ఐదు భారత్‌పైనే

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లో భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పలు రికార్డులను తన పేర రాసుకున్నాడు. ఈ సిరీస్‌లో స్మిత్‌కు ఇది రెండో శతకం. తాజా మ్యాచ్‌లో మూడు సిక్సర్లు, 13 ఫోర్లతో 140 పరుగులు సాధించిన స్మిత్‌కు టెస్టుల్లో ఇది 34వ సెంచరీ. దీంతో ఇన్నేసి శతకాలు నమోదు చేసిన సునీల్ గవాస్కర్, యూనిస్‌ఖాన్, మహేల జయవర్ధనే, బ్రియాన్ లారా సరసన చేరాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 41 సెంచరీలతో స్మిత్ కంటే ముందున్నాడు. 
 
ఇండియాపై అత్యధిక సెంచరీలు
మెల్‌బోర్న్ సెంచరీతో స్మిత్ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. టెస్టు క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగానూ స్మిత్ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న జోరూట్‌(10)ను స్మిత్ వెనక్కి నెట్టేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్‌పై కేవలం 43 ఇన్నింగ్స్‌లలోనే 11 సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా స్మిత్ రికార్డులకెక్కాడు. మూడో టెస్టులో శతకం నమోదు చేసిన స్మిత్ అన్ని ఫార్మాట్లలోనూ భారత్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా మరో ఘనత సాధించాడు. భారత్‌పై మొత్తంగా 16 సెంచరీలు సాధించి ఈ జాబితాలో స్మిత్ అగ్రస్థానంలో ఉండగా, రికీపాంటింగ్ 14 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. 

టీమిండియాపై శతకబాదుడు
వన్డేల్లో స్మిత్ సాధించిన 12 సెంచరీల్లో ఐదు భారత్‌పై చేసినవే కావడం గమనార్హం. అలాగే, భారత్‌పై సాధించిన 11 టెస్టు సెంచరీల్లో ఏడు ఆస్ట్రేలియా గడ్డపై చేసినవే. వీటిలో రెండు ఈ సిరీస్‌లో చేసినవే కావడం గమనార్హం. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు వేర్వేరు జట్లపై పదికిపైగా సెంచరీలు సాధించిన ఒకే ఒక్క ఆటగాడిగానూ స్మిత్ రికార్డులకెక్కాడు. ఆ రెండు జట్లలో ఒకటి భారత్ కాగా, రెండోది ఇంగ్లండ్. 

  • Loading...

More Telugu News