Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట అరుదైన చెత్త రికార్డు
- ప్రత్యర్థి జట్టు కెప్టెన్ బౌలింగ్‌లో ఐదు సార్లు ఔట్ అయిన సారథిగా రోహిత్ ఖాతాలో అవాంఛిత రికార్డు
- మెల్‌బోర్న్ టెస్టులో కేవలం 3 పరుగులకే ఔట్
- ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన హిట్‌మ్యాన్
- మరోసారి తీవ్రంగా నిరాశపరిచిన హిట్‌మ్యాన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. సిరీస్‌లోని గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన హిట్‌మ్యాన్... ఎంసీజీ (మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్) వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. కేవలం 5 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో బోలాండ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన చెత్త రికార్డ్ చేరింది.
టెస్ట్ క్రికెట్‌లో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ బౌలింగ్‌లో ఏకంగా ఐదుసార్లు ఔట్ అయిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో ఈ అవాంఛిత రికార్డు హిట్‌మ్యాన్ ఖాతాలో చేరింది. దీంతో మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టెడ్ డెక్స్టర్‌లతో సమంగా రోహిత్ శర్మ నిలిచారు.
పాకిస్థాన్ ఆల్‌టైమ్ గ్రేట్, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో నాటి భారత కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఐదుసార్లు ఔట్ అయ్యాడు. ఇక ఇంగ్లండ్ మాజీ సారథి టెడ్ డెక్స్టర్‌ను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిచీ బెనౌడ్ కూడా 5 సార్లు ఔట్ చేయడం గమనార్హం.