Crime News: వేతనం రూ. 13 వేలు.. వాడేది బీఎండబ్ల్యూ కారు.. గాళ్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా 4 బీహెచ్‌కే ఫ్లాట్.. వెలుగులోకి నమ్మలేని నిజాలు!
- మహారాష్ట్రలోని ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఘరానా మోసం
- సహోద్యోగితో కలిసి పనిచేస్తున్న సంస్థకే కన్నం
- సంస్థ సొమ్ము 13 బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ
- గాళ్‌ఫ్రెండ్‌కు వజ్రాలు పొదిగిన కళ్లద్దాలకు ఆర్డర్
- ఆరు నెలల తర్వాత మోసం వెలుగులోకి
మహారాష్ట్రలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి నెల వేతనం రూ. 13 వేలు. కానీ, అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారు వాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. బీఎండబ్ల్యూ బైక్‌పై తిరుగుతూ కనిపించేవాడు. అంతేనా? ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎయిర్‌పోర్టుకు ఎదురుగా గాళ్‌ఫ్రెండ్‌కు 4బీహెచ్‌కే ఫ్లాట్ కొని గిఫ్ట్‌గా ఇచ్చాడు. రూ. 13 వేల జీతంతో ఇవన్నీ సాధ్యమా? అన్నదే మీ ప్రశ్న అయితే, తప్పకుండా ఇది చదవాల్సిందే.
23 ఏళ్ల హర్షకుమార్ క్షీర్‌సాగర్ ఛత్రపతి శంభాజీనగర్‌లోని ప్రభుత్వ డిపార్ట్‌మెంటల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి. నెలకు రూ. 13 వేల జీతం. అయితే, జీవితాన్ని ఖరీదుగా గడపడాన్ని ఎంతగానో ఇష్టపడే హర్షకుమార్ సహోద్యోగి అయిన యశోదాశెట్టితో కలిసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఖాతాలోని రూ. 21,59,38,000 కొల్లగొట్టాడు. ఇందుకోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను వాడుకున్నారు.
ఆ సొమ్ముతో ఏం చేశారు?
కొట్టేసిన ప్రభుత్వ సొమ్ముతో హర్షకుమార్ ఓ బీఎండబ్ల్యూ కారు, బీఎండబ్ల్యూ బైక్, గాళ్‌ఫ్రెండ్ కోసం ఛత్రపతి శంభాజీనగర్‌లో 4 బెడ్రూంల ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అంతేకాదు, ఆమె కోసం వజ్రాలు పొదిగిన కళ్ల జోడుకు ఆర్డర్ ఇచ్చాడు.
రూ. 35 లక్షలతో మరో ఎస్‌యూవీ
ఈ కేసులో నిందితురాలైన మహిళా ఉద్యోగి రూ. 35 లక్షలు పెట్టి ఎస్‌యూవీ కొనుగోలు చేసింది. విషయం వెలుగులోకి రావడంతో ప్రధాన నిందితుడైన హర్షకుమార్ బీఎండబ్ల్యూ కారుతో పరారయ్యాడు.
నేరానికి ఎలా పాల్పడ్డారు?
బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు చెక్‌పై డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సంతకం కావాలి. అయితే, ఇంటర్నెట్ లావాదేవీలకు ఎలాంటి సంతకం అవసరం లేదు. దీంతో అతడు ఒక ప్లాన్ రచించాడు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అకౌంట్‌కు లింక్ అయి ఉన్న ఈమెయిల్‌ను పోలినట్టుగా ఒక్క అక్షరం తేడాతో మరో ఈమెయిల్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాత లెటర్‌హెడ్‌ను ఉపయోగించి బ్యాంకుకు లెటర్ రాస్తూ ఈమెయిల్ అప్‌డేట్ చేయాలని కోరాడు. బ్యాంకు అధికారులు ఆ కొత్త ఈమెయిల్‌ను ఖాతాకు లింక్ చేసిన తర్వాత లావాదేవీలకు మార్గం సుగమమైంది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మోసం
ఈమెయిల్ ఖాతాను ఉపయోగించి హర్షకుమార్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని యాక్టివేట్ చేసుకున్నాడు. దీని ద్వారా ఈ ఏడాది జులై 1, డిసెంబర్ 7 మధ్య రూ. 21,59,38,000ను 13 బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. హర్షకుమార్, యశోదాశెట్టి, ఆమె భర్త బీకే జీవన్ ముగ్గురూ కాంట్రాక్ట్ ఉద్యోగులే కావడం గమనార్హం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ డిప్యూటీ డైరెక్టర్ ఇటీవల బ్యాంకు ఖాతాను పరిశీలించడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.