Pothina Mahesh: వంగవీటి రంగా అందరివాడు... రాధా మాత్రం...!: పోతిన మహేశ్
- నేడు వంగవీటి రంగా 36వ వర్ధంతి
- విజయవాడలో కార్యక్రమం
- వంగవీటి రాధాపై తీవ్ర విమర్శలు చేసిన పోతిన మహేశ్
ఇవాళ వంగవీటి రంగా 36వ వర్ధంతి. ఈ సందర్భంగా విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో రంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. బెజవాడలోని చెరువు సెంటర్ లో ఏర్పాటు చేసిన రంగా వర్థంతి కార్యక్రమానికి వైసీపీ నేత పోతిన వెంకట మహేశ్ హాజరయ్యారు. రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన... రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వంగవీటి రంగా అందరివాడుగా పేరు తెచ్చుకున్నాడని, కానీ రాధా మాత్రం ఆయనకు కుటుంబ వారసుడిగానే మిగిలుపోతున్నాడని అన్నారు. రంగా ఆశయాల కోసం రాధా ముందుకురావడంలేదని, కేవలం ఎన్నికల సమయంలోనే రాధా బయటికి వస్తున్నారని వ్యాఖ్యానించారు.
"రంగా సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తి... ప్రజా సమస్యలపై, కాపు సమాజ ఇబ్బందులపై మాట్లాడకపోవడం బాధాకరం. రాధా ఆలోచన ఏంటో అర్థం కావడంలేదు. కాపు వర్గం అణచివేతకు గురవుతున్నా స్పందించడం లేదు... కనీసం కాపు రిజర్వేషన్లపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. రంగా విగ్రహాలను ఆవిష్కరిస్తూ ఆయనకు తానే వారసుడ్నని చెప్పుకోవడం తప్ప రాధా చేస్తున్నది ఏమిటి?
రంగా వారసులుగా మేం అనేక పోరాటాలు చేశాం... కానీ రాధా మాత్రం బీసీ వర్గాల భవిష్యత్తును నాశనం చేసే వ్యక్తులతో చేతులు కలపడం దురదృష్టకరం. జిల్లాకు రంగా పేరు పెట్టాలని ఒక్క మాట మాట్లాడొచ్చు కదా... కనీసం వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా మాట్లాడకపోతే ఎలా! రాధా పదవి గురించి కాకుండా, ఇకనైనా తన తండ్రి రంగా ఆశయ సాధన కోసం కృషి చేయాలి" అని పోతిన మహేశ్ స్పష్టం చేశారు.