Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్‌లో ఊహించని రికార్డ్ సాధించిన ఆసీస్ అరంగేట్ర ప్లేయర్ సామ్ కొంస్టాస్
- టెస్ట్ ఫార్మాట్‌లో బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన ఆటగాడిగా కొంస్టాస్ రికార్డ్
- 4,483 బంతుల సుదీర్ఘ విరామం తర్వాత బుమ్రా బౌలింగ్‌లో తొలి సిక్సర్ కొట్టిన అరంగేట్ర ప్లేయర్
- తొలి మ్యాచ్‌లోనే ధైర్యంగా ఆడుతూ ప్రశంసలు అందుకుంటున్న కొంస్టాస్
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడు. ఫార్మాట్ ఏదైనా బ్యాటర్లపై అతడిదే పైచేయి అని గణాంకాలు చెబుతున్నాయి. టీ20 ఫార్మాట్‌లో సైతం బ్యాటర్లను అలవోకగా కట్టడి చేస్తుంటాడు. చాలా అరుదుగా బుమ్రా బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు షాట్లు కొడుతుంటారు. టెస్ట్ ఫార్మాట్‌లోనైతే బుమ్రా బౌలింగ్‌లో షాట్లు ఆడడం చాలా చాలా అరుదు. ఇక సిక్సర్లు కొట్టడమంటే దాదాపు కలేనని చెప్పుకోవచ్చు.
కానీ, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు సామ్ కొంస్టాస్ అరంగేట్ర మ్యాచ్‌లోనే బుమ్రా బౌలింగ్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అతడి బౌలింగ్‌లో 4,483 బంతుల సుదీర్ఘ విరామం తర్వాత సామ్ కొంస్టాస్ తొలి సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో అద్భుత షాట్ ఆడి సిక్సర్ కొట్టాడు.
ఆ తర్వాత ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో మరో సిక్సర్ బాదాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన రెండవ ఆటగాడిగా కొంస్టాస్ నిలిచాడు. అంతకుముందు ఇంగ్లండ్ బ్యాటర్ జాస్ బట్లర్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు. సామ్ కొంస్టాస్ భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అతడి వయసు 19 ఏళ్లు. తొలి ఓవర్‌లోనే బుమ్రాను ఎదుర్కొన్నాడు. ఆ ఓవర్ మెయిడిన్ అయినప్పటికీ ఆ తర్వాత ధైర్యంగా షాట్లు ఆడాడు. 65 బంతుల్లోనే 60 పరుగులు సాధించి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ రూపంలో ఔట్ అయ్యాడు.