Kommareddi Pattabhiram: సూరత్‌లో మురుగు నీటి శుద్ధి ప్రక్రియ అమోఘం: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
- సూరత్ మోడల్‌లో మురుగు నీటి శుద్ధి చేసే ప్లాంట్‌లను ఏపీలోనూ ఏర్పాటు చేస్తామన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్
- సూరత్‌లో మురుగు నీటిని తాగు నీటి స్థాయిలో శుద్ధి చేసి జౌళి పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారన్న పట్టాభిరామ్
- సూరత్ నగర పాలక సంస్థ నిత్యం 1,076 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తోందని వెల్లడి
గుజరాత్‌లోని సూరత్‌లో మురుగు నీటిని తాగు నీటి స్థాయికి శుద్ధి చేసే ప్రక్రియ అమోఘమని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశంసించారు. వివిధ రాష్ట్రాల్లో ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణపై అధ్యయనం చేస్తున్న ఆయన సూరత్‌లో మురుగు నీటి శుద్ధి ప్లాంట్లను బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. సూరత్‌లో మురుగు నీటిని తాగు నీటి స్థాయిలో శుద్ధి చేసి జౌళి పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉన్నా, సూరత్ లో రెండు దశల్లో శుద్ధి చేసి, తాగు నీటి అవసరాలకు సైతం వినియోగించే స్థాయిలో అందిస్తున్నారని చెప్పారు.
సూరత్ నగర పాలక సంస్థ నిత్యం 1,076 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలోనూ జనసాంద్రత ఎక్కువగా ఉండే నగరాల్లో పెద్ద ఎత్తున వచ్చే మురుగు నీటిని ఎస్టీపీల ద్వారా తాగు నీటి స్థాయిలో శుద్ధి చేసి పరిశ్రమలకు సరఫరా చేసే దిశగా స్వచ్చాంధ్ర కార్పొరేషన్ కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.