Chandrababu: ప్రధాని మోదీతో దాదాపు గంటపాటు చంద్రబాబు భేటీ.. ఫోటోలు ఇవిగో

Chandrababu meets PM Modi

  • బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి
  • రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారి మధ్య చర్చ
  • ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనుల వివరించిన ఏపీ సీఎం

సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో, సమావేశాల్లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 

ఎన్డీఏ మీటింగ్ అనంతరం కేంద్ర ఉక్కుశాఖా మంత్రి కుమార స్వామిని సిఎం చంద్రబాబు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేసే విషయంపై కేంద్ర మంత్రితో చర్చించారు. అనంతరం కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖ రైల్వే జోన్ పనుల శంకుస్థాపన, రాష్ట్రంలో చేపట్టిన, చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసే అంశంపై చర్చించారు. అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేసినందుకు సిఎం ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ముఖ్యమంత్రి ప్రధాని మోదీని ఆయన నివాసానికివెళ్లి కలిశారు. 45 నిముషాల పాటురాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ఆర్థిక అంశాలు, సమస్యలు వంటి అంశాలపై చర్చించారు. పోలవరం, అమరావతి పనులు మళ్లీ ప్రారంభించిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించారు. పనులు వేగంగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎపికి కీలకమైన రెండు ప్రాజెక్టులు గాడిన పెట్టడానికి ఆర్థిక సాయం చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. 94 కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం నిధులు దారి మళ్లించిన విషయాన్ని...దాని వల్ల జరిగిననష్టాన్ని ముఖ్యమంత్రి  ప్రధాని దృష్టికి తెచ్చారు. వీటిలో 74 పథకాలను తిరిగి ప్రారంభించామని అన్నారు. 

ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని ప్రధానికి వివరించిన సిఎం....ఆ ప్రాజెక్టుకు అవసరమైన ముడి ఖనిజం సరఫరా అయ్యేలా చేడాలని ప్రధానిని కోరారు. దీంతో పాటు ఈ సంస్థ ఏర్పాటుకు వివిధ శాఖలకు సంబంధించి అనుమతులు త్వరితగతిన వచ్చేలా చూడాలని ప్రధానికి సీఎం విన్నవించారు. సాంకేతిక ఇబ్బందులు తొలగితే ప్రాజెక్టు వేగంగా పట్టాలు ఎక్కుతుందని... దీనికోసం సహకరించాని సిఎం కోరారు. 

గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్థవ్యస్తం చేసిందని...5 ఏళ్లకు రావాల్సిన రెవెన్యూ  డెఫిషిట్ గ్రాంట్ ను మూడేళ్లలోనే వాడేసిందని తెలిపిన ముఖ్యమంత్రి...స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా ఆర్ధిక సాయం చేయాలని ప్రధానిని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి ఎపి ప్రభుత్వం విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047ను ప్రధానికి అందజేశారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా....తమ వంతుగా రాష్ట్రం నిర్థేశించుకున్న లక్ష్యాలను, వాటిని చేరుకునేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలను, ఆలోచనలను ప్రధాని మోదీకి సీఎం వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సాయం అందించాలని సిఎం కోరారు. వచ్చే నెలలో ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో భారీగా తలపెట్టిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపే ప్రాజెక్టులపై ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించారు.

అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో సిఎం భేటీ అయ్యారు. రాష్ట్ర అర్థిక పరిస్థితులు, వాటిని గాడిన పెట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర నిధులు విడుదల వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పట్టుకుని ప్రత్యేక సాయం చేయాలని కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కోరారు. ఈ భేటీల్లో రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, ఎంపీలు పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News