Jagan: సంక్రాంతి తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తా: జగన్
- అన్ని జిల్లాల్లో పర్యటిస్తానన్న జగన్
- 2007లో జమిలీ ఎన్నికలు వస్తాయని అంటున్నారని వ్యాఖ్య
- చంద్రబాబులో భయం పెరిగిపోతోందని ఎద్దేవా
ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత తాను ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళుతున్నానని... అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుందని తాను అనుకోలేదని తెలిపారు. చంద్రబాబు పాలన బాదుడే బాదుడులా ఉందని... సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవెన్ లేదని... అందుకే మనం పోరుబాట పట్టాల్సి వస్తోందని చెప్పారు. ఇప్పటికే రైతుల కోసం ధర్నా చేశామని... ఈ నెల 27న కరెంట్ బిల్లులపై మరోసారి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు.
2027లో జమిలి ఎన్నికలు అంటున్నారని... దీంతో నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోందని జగన్ అన్నారు. మనం మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. దేశ చరిత్రలో ఎవరూ చేయని మంచి పనులను మన ప్రభుత్వ హయాంలో చేశామని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదని చెప్పారు.