Hyderabad Police: సంధ్య థియేటర్ ఘటన.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల వార్నింగ్!
- ఘటనకు సంబంధించి తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు
- ఈ ఘటనపై నిజాలను వీడియో రూపంలో ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని వెల్లడి
- పోలీసు శాఖను అప్రతిష్టపాలు చేసేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని తాజాగా హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. సంధ్య థియేటర్‌కు హీరో అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు కొందరు వీడియోలు పోస్టు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై నిజాలను వీడియో రూపంలో ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని తెలిపారు. విచారణ సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. పోలీసు శాఖను అప్రతిష్టపాలు చేసేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే పోస్టులను గుర్తించిన పోలీసులు ఈ హెచ్చరికలు చేశారు. తొక్కిసలాట ఘటన తాలూకు ఆధారాలు, సమాచారం ఉంటే తమకు అందించాలని పోలీసులు కోరారు. అలాగే సామాజిక మాధ్యమల్లో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.