CPI Ramakrishna: తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మీరు కూడా అనుమతి ఇవ్వకండి.. సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
- ఏపీలో సినిమా టికెట్ ధరలు పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వొద్దన్న రామకృష్ణ
- ఈ మేరకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని చంద్రబాబుకు లేఖ
- సంధ్య థియేటర్ ఘటనతో తెలంగాణ సర్కార్ మేల్కొందని వ్యాఖ్య
- బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమన్న రేవంత్ నిర్ణయం అభినందనీయమన్న సీపీఐ నేత
సీఎం చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఎట్టిపరిస్థితుల్లో పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల రేట్లు పెంచడం కానీ, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం కానీ చేయొద్దని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా టికెట్ల రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని చంద్రబాబును ఆయన కోరారు.
సంధ్య థియేటర్ ఘటనతో తెలంగాణ సర్కార్ మేల్కొందని రామకృష్ణ అన్నారు. ఆ రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరహానే ఏపీలో కూడా స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపును అనుమతించేది లేదని కూటమి ప్రభుత్వం ప్రకటించాలని రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తుండటంతో నిర్మాణ సంస్థలు పెద్ద హీరోల సినిమాలను భారీ బడ్జెట్లతో తెరకెక్కించి ఆ తర్వాత ప్రేక్షకుల జేబులను గుల్ల చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సినిమా వాళ్ల ఒత్తిడికి తలొగ్గి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టికెట్ రేట్ల పెంపునకు, స్పెషల్ షోలకు పర్మిషన్లు ఇవ్వడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తుందని రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.