Manu Bhaker: ఆ జాబితాలో పేరు లేకపోవడంతో మను భాకర్ తీవ్ర అసంతృప్తికి గురైందన్న తండ్రి
- ఒలింపిక్స్ కు వెళ్లకుండా ఉండాల్సిందని వాపోయిందన్న తండ్రి
- తన కూతురును షూటర్ కాకుండా క్రికెటర్ ను చేయాల్సిందని వ్యాఖ్య
- 2024 పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మను భాకర్
ఖేల్ రత్న అవార్డుల నామినీ లిస్ట్ లో తన పేరు లేకపోవడంపై మను భాకర్ తీవ్ర అసంతృప్తికి లోనైందని ఆమె తండ్రి రామ్ కిషన్ భాకర్ పేర్కొన్నారు. ఈమేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ కిషన్ మాట్లాడుతూ.. ఖేల్ రత్న అవార్డులకు సంబంధించిన నామినీల జాబితాలో మను పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తను ఒలింపిక్స్ కు వెళ్లకుండా ఉండాల్సిందని, మెడల్స్ సాధించకపోయినా బాగుండేదని మను వ్యాఖ్యానించిందని చెప్పారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించిన నామినీ జాబితాపై రామ్ కిషన్ విమర్శలు చేశారు. దేశానికి రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించినా తన కూతురుకు తగిన గుర్తింపు రాలేదన్నారు.
తన కూతురుకు షూటింగ్ నేర్పించినందుకు తాను ఇప్పుడు చింతిస్తున్నట్లు చెప్పారు. షూటర్ కాకుండా మనును క్రికెటర్ ను చేస్తే బాగుండేదని, అప్పుడు అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఉండేవని అన్నారు. 2024 ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ లు ఎవరూ సాధించని ఘనత తన కూతురు సాధించిందని, రెండు మెడల్స్ గెల్చుకుందని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆమె పేరును ఖేల్ రత్న అవార్డు పరిశీలనకు తీసుకోకపోవడం సరికాదని అన్నారు.
తన కృషికి తగిన గుర్తింపు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఖేల్ రత్న అవార్డు కోసం మను ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుందని, కనీసం తన పేరును ప్రభుత్వం పరిశీలిస్తుందని భావించిందని చెప్పారు. తీరా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నామినీల లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో మను తీవ్ర ఆవేదనకు లోనైందని చెప్పారు. తాను అసలు క్రీడాకారిణిగా కాకుండా ఉండాల్సిందని తనతో వాపోయిందని రామ్ కిషన్ భాకర్ చెప్పారు.