Manchu Manoj: విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్

Manchu Manoj once again approaches police against his brother Manchu Vishnu

  • మోహన్ బాబు కుటుంబంలో కొనసాగుతున్న వివాదం
  • తన అన్నపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసిన మనోజ్
  • ఏడు అంశాలతో ఏడు పేజీల ఫిర్యాదు

మోహన్ బాబు కుటుంబంలో రేగిన వివాదం ఇప్పట్లో చల్లారేట్టు లేదు. తాజాగా, మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. తన సోదరుడు మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు. మనోజ్ తన ఏడు పేజీల ఫిర్యాదులో ప్రధానంగా ఏడు అంశాలను ప్రస్తావించారు. కాగా, మంచు విష్ణుకు సన్నిహితుడైన వినయ్ అనే వ్యక్తిపైనా మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 

ఇటీవల హైదరాబాద్ శివారు ప్రాంతం జల్ పల్లిలో మోహన్ బాబు నివాసం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు వర్గం, మనోజ్ వర్గం పోటాపోటీగా బౌన్సర్లను రంగంలోకి దింపడంతో వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో, తన నివాసంలోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. జర్నలిస్టులపై దాడితో మోహన్ బాబుపై కేసు నమోదైంది. 

అటు, ఉద్రిక్తతలకు దారి తీసే ఎలాంటి చర్యలకు పాల్పవడవద్దంటూ మంచు విష్ణు, మంచు మనోజ్ లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంతలోనే మళ్లీ మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదానికి ఇప్పట్లో ముగింపు పడదన్న విషయం అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News