Tollywood: రేవతి కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల ఆర్థిక సాయం
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి
- బాధిత కుటుంబాన్ని కలిసి చెక్కు అందించిన నిర్మాత నవీన్
- కిమ్స్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు అందజేశారు. సోమవారం నాడు ఆయన బాధిత కుటుంబాన్ని కలిసి చెక్కును అందజేశారు.
పుష్ప-2 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించింది. ఈ నెల 4న సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందారు. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి కుటుంబానికి అండగా ఉంటామని నటుడు అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో మైత్రీ మూవీస్ సంస్థ బాధిత కుటుంబానికి రూ.50 లక్షలను అందించింది.