Allu Arjun: అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం...?
- గాంధీభవన్ కు వెళ్లిన చంద్రశేఖర్ రెడ్డి
- దీపా దాస్ మున్షీతో మాట్లాడేందుకు యత్నించిన వైనం
- ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తిచూపని దీపా దాస్ మున్షీ!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, ఒక రాత్రి జైలు జీవితాన్ని గడపడం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ పై ఉన్నారు. తొక్కిసలాటకు, ఒక మహిళ ప్రాణం పోవడానికి అల్లు అర్జున్ కారణమని ముఖ్యమంత్రి, ఇతరు మంత్రులు కూడా కామెంట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అంతుచిక్కని విధంగా ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (బన్నీ భార్య స్నేహా రెడ్డి తండ్రి) గాంధీభవన్ కు వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ ఈరోజు గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం అనంతరం తన ఛాంబర్ లోకి ఆమె వెళ్లారు. ఆమెను అనుసరిస్తూ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆమె ఛాంబర్ లోకి వెళ్లారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయనతో మాట్లాడేందుకు దాపా దాస్ మున్షీ ఆసక్తి చూపలేదంటూ కథనాలు వచ్చాయి. కాసేపటి తర్వాత ఆయన గాంధీభవన్ నుంచి వెళ్లిపోయారు.
మీడియా ప్రతినిధులు ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి... ఆ తర్వాత కాంగ్రెస్ లోకి చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి, అల్లు అర్జున్ కు గ్యాప్ పెరిగిపోయిన నేపథ్యంలో ఆయన రంగంలోకి దిగినట్టు చెపుతున్నారు.