Viral Videos: దూడ పైనుంచి దూసుకెళ్లిన కారు.. వాహనాన్ని రౌండప్ చేసి రక్షించుకున్న గోవులు.. ఆశ్చర్యపరిచే వీడియో ఇదిగో!

Calf came under the car the cow came running and stood in front of the car

  • కారు కింద చిక్కుకుపోయిన దూడ కోసం గోవుల తపన
  • వాహనం ముందుకు కదలకుండా అడ్డుకున్న వైనం
  • కారును పైకి లేపి దూడను రక్షించిన స్థానికులు
  • గాయపడిన దూడను తమతో తీసుకెళ్లిన గోవులు
  • మనుషుల కంటే ఆవులే బాగా స్పందించాయంటున్న నెటిజన్లు

మనిషి సంఘజీవే అయినా పట్టింపు లేని తనం ఎక్కువ. పక్కవాడికి ఏం జరిగితే మనకెందుకులే అన్న నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. హడావుడి జీవితం కూడా అందుకు ఒక కారణం కావొచ్చు. అయితే, మనతో పోల్చినప్పుడు సృష్టిలోని ఇతర జీవుల్లో ఐక్యత ఎక్కువేనని అనిపిస్తుంది. ఇందుకు బోల్డన్ని ఉదాహరణలు కూడా కనిపిస్తాయి. 

ఒక కాకి ఆపదలో ఉన్నప్పుడు వేలాది కాకులు వచ్చి దాని చుట్టూ చేరుతాయి. ఒక జంతువు ఆపదలో ఉన్నప్పుడు మిగతావన్నీ దానిని రక్షించే ప్రయత్నం చేస్తాయి. దీనిని బలపరిచే ఘటనలు చాలానే ఉన్నప్పటికీ తాజాగా వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 

రోడ్డుపై వెళ్తున్న ఓ కారు కింద ఆవుదూడ చిక్కుకుంది. అది గమనించిన తల్లి ఆవుతోపాటు మరికొన్ని ఆవులు వేగంగా పరిగెడుతూ కారును అడ్డగించాయి. కారు ముందు నిల్చుని అది ముందుకు కదలకుండా అడ్డుకున్నాయి. ఆ తర్వాత అవన్నీ కారు చుట్టూ ఆందోళనగా తిరిగాయి. గమనించిన స్థానికులు ఏదో జరిగిందని ఊహించారు. 

ఆ తర్వాత కారు కింద దూడ చిక్కుకోవడాన్ని గమనించి కారులో ఉన్న వారిని కిందికి దిగమని కోరారు. ఆ తర్వాత అందరూ కలిసి కారును పైకిలేపి కింద చిక్కుకున్న దూడను రక్షించి బయటకు తీశారు. గాయపడిన దూడ కుంటుకుంటూ బయటకు రావడంతో ఆవులన్నీ కలిసి దానిని తీసుకెళ్లాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 

దూడ కారు కింద ఎలా చిక్కుకుందని కొందరు ప్రశ్నిస్తే.. గోవులన్నీ కలిసి దాని దూడ కోసం పడిన ఆవేదన తమను కదిలించిందని మరికొందరు రాసుకొచ్చారు. ఆపదలో ఉన్న దూడను రక్షించుకునే విషయంలో మనుషుల కంటే గోవులే బాగా స్పందించాయని కామెంట్లు చేస్తున్నారు. వేగంగా ఆలోచించడం, టీం వర్క్, ఆపదలో ఉన్న దూడను రక్షించాలన్న వాటి తపన తమను ఆశ్చర్యపరిచిందని మరికొందరు రాసుకొచ్చారు. ‘ఎలాంటి గొడవ లేదు, రాళ్లు విసురుకోలేదు, ఎవరిపైనా దాడి జరగలేదు, వాహనాలను తగలబెట్టలేదు.. చాలా ప్రశాంతంగా దూడను రక్షించారు.. గోవును పూజించడంలో తప్పులేదు’ అని మరొకరు రాసుకొచ్చారు. చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో జరిగిందీ ఘటన.

  • Loading...

More Telugu News